Friday, November 22, 2024

అక్రమంగా రూ.1.29 కోట్ల విలువైన బంగారం తరలింపు .. మ‌హిళ‌ అరెస్ట్

ఓ మ‌హిళ అక్ర‌మంగా బంగారాన్ని త‌ర‌లిస్తుండ‌గా బీఎస్ ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌ లోని 24 పరగణాల జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకుంది. మహిళ నుంచి 27 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది. కేవలం రూ.2 వేల కోసం ఇందుకు ఒప్పుకున్నట్లు ఆమె విచారణలో వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టిగాంగ్‌ కు చెందిన ఓ మహిళ బంగారంతో సరిహద్దు దాటినట్లు బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే మహిళా సిబ్బంది చెక్‌పోస్ట్‌ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. 34 ఏళ్ల మనికా దర్‌ వద్ద బంగారు కడ్డీలు కనిపించాయి. దుస్తుల్లో బంగారు కడ్డీలను ఉంచుకుని, వాటిని నడుముకు చుట్టుకుని సరిహద్దులు దాటిస్తున్నట్లు గుర్తించారు.ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. బెంగాల్‌ లోని బరాసత్ ప్రాంతంలో ఉంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తికి ఈ బంగారం అందించాలని తనకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ పని చేస్తే రూ.2 వేలు ఇస్తానని సదరు వ్యక్తి చెప్పాడని వెల్లడించింది. మొదటిసారి ఈ పనిలోకి దిగినట్లు చెప్పుకొచ్చింది. బంగారు కడ్డీలను కస్టమ్స్‌ అధికారులకు బీఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించారు. వాటి బరువు 2 కిలోల కంటే ఎక్కువ ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.1.29 కోట్ల వరకు విలువ ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement