హిమాచల్ ప్రదేశ్‌లోని సట్లజ్ ఉపనది అయిన టిడాంగ్ నదిపై రెటాఖాన్ వద్ద నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ వద్ద ప్రమాదం జరిగింది. టిడాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం లోపలికి వెళ్లే ట్రాలీ జారి లోపలికి పడిపోవడంతో ఇవ్వాల (శనివారం) ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాజెక్టుకు చెందిన ఐదుగురు కార్మికులు ట్రాలీలో ప్రయాణిస్తుండగా అది ట్రాక్‌పై నుంచి జారి కింద పడిపోయినట్లు సమాచారం. ఈ సొరంగం 45 నుండి 50 డిగ్రీల వాలుతో వందల అడుగుల వరకు విస్తరించి ఉంటుందని అధికారులు తెలిపారు.
కాగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) యొక్క 50వ బెటాలియన్ ఇతర ఏజెన్సీలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది. గాయపడిన ముగ్గురు కార్మికులను సొరంగం నుండి సేఫ్‌గా తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీయడంతో ఆపరేషన్ నిలిపివేశారు. చనిపోయిన ఇద్దరు కార్మికులు హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ వాసులుగా గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..