హైదరాబాద్, ఆంధ్రప్రభ: మనిషి అవసరం లేకుండా 24 గంటలు నడిచే టీ స్టాల్ ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జెమ్ ఒపెన్క్యూబ్ టెక్నాలజీస్ రూపొందించిన ప్రపంచంలోనే తొలి వాటర్, టీ, కాఫీ, బిస్కట్ (డబ్ల్యుటిసి) ఆటోమెటిక్ వెండింగ్ మెషీన్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, సినీ నటుడు మంచు మనోజ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభవరణం రామకృష్ణ, ఏపీ సిపిడిసిఎల్ డైరెక్టర్ రమాదేవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డబ్ల్యుటిసి డిస్పెన్సర్ మెషీన్ ఆవిష్కర్త, జెమ్ ఒపెన్క్యూబ్ టెక్నాలజీస్ సీఈవో వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ వినూత్న యంత్రం నిరుద్యోగ యువతకు మంచి ఆదాయాన్ని సంపాదించడంలో దోహదపడుతుందన్నారు. బ్యాంక్ లోన్, ఇన్సూరెన్స్ సదుపాయంతో రిఫ్రిజిరేటర్ ధర కన్నా చాలా తక్కువ ధరకు ఈ యంత్రం మార్కెట్లో విడుదల చేయబడుతుందని పేర్కొన్నారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో నేటికీ వెండింగ్ మెషీన్లు ప్రజలకు అందుబాటులో లేవనీ, ఈ డబ్ల్ల్యుటిసి మెషీన్లతో విమానాశ్రయాల లగ్జరీని వీధి స్థాయికి తీసుకు రావడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వినోద్‌కుమార్ తెలిపారు.