రాజస్థాన్ రాష్ట్రంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. అయిదు రోజుల్లో ఏడుగురు చిన్నారులు చనిపోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. సిరోహి జిల్లాలోని ఫులాబాయి ఖేడా, ఫులాబెర్ గ్రామాల్లో రెండు నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోయారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలతో ఏడుగురు పిల్లలు చనిపోయినట్టు ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ జగేశ్వర ప్రసాద్ తెలిపారు. చిన్నారుల మృతికి కారణం ఏమిటన్నది తెలియలేదన్నారు. వైరల్ డిసీజ్ కారణం కావచ్చని, అయితే.. రక్త నమూనాల పరీక్షల రిపోర్టులు వస్తే గానీ దీని గురించి ఏమీ చెప్పలేమన్నారు. కాగా, ఈ మిస్టరీ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించిన ఒక రోజులోనే చనిపోయినట్లు ప్రసాద్ తెలిపారు.
ఐదేండ్ల కుమారుడు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి మంచినీరు అడిగాడని, అనంతరం అతడికి మూర్ఛ వచ్చినట్లు ఓ బాలుడి తల్లి తెలిపిందన్నారు. ఉదయం 8 గంటలకు వాంతులు చేసుకుని ఆ తర్వాత పిల్లవాడు చనిపోయినట్లు ఆమె చెప్పిందన్నారు. మరోవైపు చనిపోయిన ఏడుగురు పిల్లల్లో ముగ్గురు స్థానికంగా తయారు చేసిన ఐస్ క్రీం తిన్నట్లు తమకు తెలిసిందని ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ జగేశ్వర ప్రసాద్ తెలిపారు.
మరో ఇద్దరు కూడా ఆ ఐస్ తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారని, అయితే ఎవరూ దీనిని చూడలేదన్నారు. విషాహారం వల్ల కూడా ఇంత వేగంగా మరణాలు సంభవించవని ఆయన అభిప్రాయపడ్డారు. జైపూర్, జోధ్‌పూర్ నుంచి వైద్య బృందాలను ఆయా గ్రామాలకు పంపుతున్నట్లు సిరోహి జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిస్థితిని గమనిస్తున్నామని, 300 ఇళ్ల నుంచి 58 మంది పిల్లల రక్త నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.