మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పంచాయతీ సమితిల చైర్‌పర్సన్‌లు, డిప్యూటీ చైర్‌పర్సన్‌ల ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 13 పంచాయతీ సమితిలకు ఎన్నికలు జరుగగా ఒక్కటంటే ఒక్క చైర్‌పర్సన్ పదవిని కూడా బీజేపీ దక్కించుకోలేకపోయింది. కేవలం మూడంటే మూడు డిప్యూటీ చైర్‌పర్సన్ పదవులతో సరిపెట్టుకుంది.
నాగ్‌పూర్ అంటే.. పలువురు సీనియర్ బీజేపీ లీడర్ల స్వస్థలం. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వంటి మహామహులు నాగ్‌పూర్ వాసులు. ఇంతమంది హేమహేమీల స్వస్థలమైన నాగ్‌పూర్‌లో బీజేపీ ఘోర పరాజయం చెందడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. మొత్తం 13 పంచాయతీ సమితిల్లో 9 చైర్‌పర్సన్ పదవులు, 8 డిప్యూటీ చైర్‌పర్సన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 3 చైర్‌పర్సన్ పదవులు దక్కాయి. మరో చైర్‌పర్సన్ పదవిని శివసేన తన ఖాతాలో వేసుకుంది.