Saturday, November 23, 2024

బిపిన్ రావ‌త్‌, ఆర్మీ వీరుల‌ స్మార‌క చిహ్నాన్ని కూనూరులో నిర్మించాలి.. ప్ర‌ధానికి స్థానికుల లేఖ..

త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌, ఇత‌ర ఆర్మీ ఆఫీస‌ర్ల స్మార‌కార్థం ప్ర‌త్యేక నిర్మాణం చేప‌ట్టాల‌ని కూనూరు వాసులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆర్మీ హెలికాప్ట‌ర్‌ క్రాష్ అయిన ప్ర‌దేశంలో జనరల్ బిపిన్ రావత్, ఇతర ఆర్మీ అధికారుల స్మారక చిహ్నం నిర్మించాలని ప్ర‌ధాని మోడీని, డిఫెన్స్ మినిస్ట‌ర్ రాజ్‌నాథ్ సింగ్‌ను, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను కోరుతూ సోమ‌వారం లేఖ రాశారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా.. కూనూర్ వెల్లింగ్‌టన్ కంటోన్మెంట్‌లో దేశంలోనే తొలి స్మార‌క చిహ్నం ఏర్పాటు చేయాల‌ని ఆ లెట‌ర్‌లో విజ్ఞాపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కూనూరు గ్రామ‌స్తులు వేర్వేరు లేఖ‌లు రాసి త‌మ అభ్య‌ర్థ‌న‌ను విన్న‌వించారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాద‌ ఘటన స్థానిక ప్ర‌జ‌ల్లో విషాదాన్ని నింపిందని, కూనూరు సమీపంలోని నంజప్పసతీరంలో విషాదం చోటుచేసుకుందని లేఖలో పేర్కొన్నారు. అమరవీరుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నంలో తమిళనాడు రెవెన్యూ శాఖకు చెందిన స్థలంలో స్మారక చిహ్నాన్ని నిర్మించాలని కోరారు.

“నంజప్పసతీరం సమీపంలో ఉన్న మెట్టుపాళయం-ఊటీ (ఉదగమండలం) లైన్‌లోని కట్టేరి పార్క్, రన్నిమేడు రైల్వే స్టేషన్‌ల పేరును.. త్యాగానికి గుర్తుగా ఉన్న జనరల్ బిపిన్‌ రావత్ పేరుగా మార్చాలని అభ్యర్థిస్తున్నాం..’’ అని లేఖ‌లో పేర్కొన్నారు. కాగా, డిసెంబరు 8న కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ మరో 10 మంది సాయుధ దళాలకు చెందిన వారు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement