అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు- జరుగుతున్నాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్నారై జనసైనికులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మనోహర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రసంగం కోసం యావత్తు రాష్ట్రం ఎదురు చూస్తోందని తెలిపారు. ఈ సభా వేదిక నుంచే భవిష్యత్తు కార్యాచరణ, పార్టీపరంగా తీసుకోవాల్సిన కొన్ని రాజకీయ నిర్ణయాలపై అధ్యక్షుడు ప్రసంగిస్తారని చెప్పారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు సాయం అందించాలని ఎన్నారై జనసైనికులకు ఒక పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీ అంటే టీ-మ్ ఎఫెక్ట్ అని, మనందరం కలిసికట్టు-గా ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఏఏ గ్రామాల్లో జనసైనికులు యాక్టివ్‌గా పని చేస్తున్నారో గమనించి, వారికి మీవంతు ఉడతాభక్తిగా సాయం అందిస్తే అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న జనసైనికులు, వీరమహిళలకు కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పిస్తామని, అయితే ఆవిర్భావ సభ అనంతరం ఈ విషయంలో ముందుకు వెళ్తామని వివరించారు. అందరూ గర్వపడే విధంగా తమకన్నా ఒక రోజు ముందే మీరు వ్యవస్థాపన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని ఎన్నారై జనసైనికులతో నాదెండ్ల మనోహర్ అన్నారు.