క్రిప్టో కరెన్సీ పేరుతో హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగింది. XCSPL పేరుతో వెలిసిన కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. లక్ష పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసి డబ్బులు తీసుకుంది. నాలుగు రెట్లు లాభమంటూ ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి 10 లక్షల వరకు వసూలు చేసింది. అప్పు చేసి, లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డులు వాడి బాధితులు పెట్టుబడి పెట్టారు. అయితే రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. ఇదిగో అదిగో అంటూ నెట్టుకొస్తుండడంతో నిలదీశారు. దీంతో గొడవ పెద్దదైంది. మీడియా చెవిన పడింది. దీనిపై వివరాలు అడిగితే XCSPL కంపెనీ నిర్వాహకులు సరిగ్గా స్పందించడం లేదు.
కేసు ఫైల్ అయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల పేరుతో ముందు వల వేశారు. కొందరు నిరుద్యోగులను చేర్చుకున్నారు. వారి చేత పెట్టుబడి పెట్టించారు. పనిచేస్తున్న కంపెనీ కావడం.. డబ్బులు నాలుగు రెట్లు ఇస్తామని చెప్పడంతో ఇన్వెస్ట్ చేశారు ఉద్యోగులు. అక్కడి నుంచి వారికి పరిచయం ఉన్న వారి చేత కూడా పెట్టుబడి పెట్టించారు. తమ ఉద్యోగానికి ఏం ఇబ్బంది వస్తుందోనని నిర్వాహకులు చెప్పినట్టే వారికి తెలిసిన వారి చేత డబ్బులు ఇప్పించారు. కానీ, ఎంతకీ డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించి మీడియా ముందుకొచ్చారు బాధితులు. ఈ ఘటనను చూస్తుంటే అచ్చం స్టాలిన్ సినిమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. నువ్వో ముగ్గురికి సాయం చేయి.. వాళ్లని తలా ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పు.. స్టాలిన్ సినిమాకు సంబంధించిన ఈ ఐడియా అప్పట్లో కొత్తగా అనిపించింది. సినిమా యావరేజ్ గా ఆడినా.. కాన్సెప్ట్ కు అంతా కనెక్ట్ అయ్యారు. అయితే.. కొందరు కేటుగాళ్లు దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ఇలా మోసాలకు పాల్పడుతున్నారు.