మెదక్ ప్రతినిధి, (ప్రభన్యూస్) : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని మొనసిస్ లైఫ్ సైన్సెస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాశమైలారం పారిశ్రామికవాడలోని ప్రజలంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. మోనాసిస్ లైఫ్ సైన్సెస్ రసాయన పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో పరిశ్రమలోని కెమికల్ డ్రమ్ములు ఎగిసి పడుతున్నాయి. అక్కడ పనిచేసే కార్మికులు ఒక్కసారిగా అటూ ఇటూ పరుగులు పెట్టారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు కార్మికులు భయాందోళనకు గురయ్యారు. భారీ అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంటలు సమీపంలోని పెయింట్ పరిశ్రమకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పటాన్ చెరు, సంగారెడ్డి, బీడిఎల్ నుండి ఆరు అగ్నిమాపక వాహనాలు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నాయి. పరిశ్రమలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం తెలిపింది. పటాన్‌చెరు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలుసుకుంటున్నారు.