హైదరాబాద్, ఆంధ్రప్రభ: అంతరాష్ట్ర ప్రమాణాలతో దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మరో వందేళ్ళవరకు తాగునీటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.4,765 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించింది. మిషన్ భగీరథ ద్వారా పట్టణప్రాంతాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తాగునీటి అవసరాలపై దృష్టి సారించింది. నిజాంపాలనలో ‘సర్కార్ నల్లా భారాగంటా కుల్లా’ ఉండే హైదరాబాద్ మంచినీటి వ్యవస్థ కాలక్రమేణా నినాదంగానే మిగిలింది. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి రంగంపై దృష్టి సారించింది.
నిజాం కాలంలో మాదిరిగా నిరంతర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూపొందించిన ప్రణాళిక ‘భారీ జలమాలిక’ సమైక్యపాలనలో హైదరాబాద్‌లో 688 చ.కి.మీ. ఉన్న మంచినీటి సరఫరాను తెలంగాణ ప్రభుత్వం 1,456 చ.కి.మీ.ల వరకు విస్తరించింది. రూ.1,900 కోట్ల అంచనా వ్యవయంతో 40లక్షల మందికి తాగునీరు అందించడానికి కొత్తగా 56 సర్వీసు రిజర్వాయర్లను నిర్మిస్తోంది. వీటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని చివరిదశలో ఉన్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌కు జలమండలి రోజుకు 448 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1628 చ.కి.మీ. పరిధిలోని కోర్ సిటీ 169.30 చ.కి.మీ కాగా శివారు ప్రాంతాలు 518.90 చ.కి.మీ, ఓఆర్‌ఆర్ గ్రామాల పరిధి 939.80 చ.కి.మీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించి భారీ జలమాలతో నీటిని స్టోర్ చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా, గోదవరి నదుల నుంచి హైదరాబాద్‌కు రక్షిత జలాలను తరలిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటి తరలింపులో ప్రక్రియకు అంతరాయం కలిగితే ఉత్పన్నమయ్యే పరిస్థితులతోపాటు విస్తరిస్తున్న హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పనచేసి సర్వేలు పూర్తి చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగురోడ్డు వెంట 3 వేల ఎంఎం డయా పైపులైను 12 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ.4,765 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 191 గ్రామాలకు అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద రూ.756 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. గోదావరి ప్రాజెక్టులోని కీలకమైన ఘన్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్‌చెరు రిజర్వాయర్ వరకు 1800 ఎంఎం డయాతో 44 కి.మీ. మేర పైపులైన్ పనులు పూర్తయ్యాయి.
అయితే ప్రస్తుతం కృష్ణా గోదావరి జలాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి నగరం అంతర్గత వ్యవస్థలకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకునే అవకాశం ఉంది. ఏ రిజర్వాయర్‌లోనైనా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా నీటి తరలింపు బ్రేక్ డౌన్ కాకుండా రిజర్వాయర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంలో కేశవాపురం, దేవులమ్మ నాగారంలో నిర్మించ తలపెట్టిన భారీ రిజర్వాయర్లను ఔటర్ రింగు రోడ్డు మెయున్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసేందుకు వీలుంటుందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా రూ.5 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి కోసం చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం వద్ద 10 టీఎంసీల రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి నీళ్ల కోసం శామీర్ పేట మండలం కేశవాపూర్‌లో 101 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి.
భవిష్యత్ తాగునీటి అవసరాల కోసమే: వీరమళ్ల ప్రకాష్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్
హైదరాబాద్ సరిహద్దు జిల్లాలలోని శివారు ప్రాంతాలను కలుపుకుని వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్ తాగునీటి అవసరాలకు తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ భారీ జలమాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ చెప్పారు. ఈ జలమాల వాటర్ గ్రిడ్‌గా పనిచేస్తుందన్నారు. ప్రత్యేకంగా నిర్మిస్తున్న జలాశయాల్లోకి వచ్చే నీటిని నిల్వచేసి సరఫరా చేయడం లక్ష్యమన్నారు. కృష్ణా, గోదావరి, సింగూరు తదితర నదీ వ్యవస్థల నుంచి ప్రవాహవేగంతో జలాశయాల్లోకి చేరే నీటిని అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ఇందులో భాగమన్నారు. వర్షాభావ పరిస్థితులను సైతం అధిగమించి నీటి సరఫరా చేయడమే లక్ష్యమని చెప్పారు.