మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళలను దాదాపు 15 మంది మగాళ్లు అటకాయించి ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఇదంతా నడిరోడ్డుపైనే జరిగింది. ఈ దారుణాన్నికొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇదికాస్త వైరల్‌గా మారి ప్రభుత్వ యంత్రాంగాన్ని షేక్ చేస్తోంది. వీడియో ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
భగోరియా పండుగ సందర్భంగా ఇద్దరు గిరిజన మహిళలను కొంతమంది మగాళ్లు బహిరంగంగా వేధించిన వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలను వేధిస్తున్న భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 15 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసినప్పటికీ బాధితుల జాడ తెలియలేదు. అలీరాజ్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
గిరిజన మహిళలను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో అలీరాజ్‌పూర్ జిల్లా పోలీసులు ఇవ్వాల (సోమవారం) 19 , 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 15 మంది బాలురుతో సహా నిందితులందరినీ గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మొన్నటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో సోన్వా ప్రాంతంలోని వాల్‌పూర్ శివారులో ఈ ఘటన జరిగింది. వీడియోలో ఇద్దరు మహిళలు అలీరాజ్‌పూర్‌లోని రద్దీగా ఉండే రహదారిపై వాహనం పక్కన నిలబడి, పట్టపగలు వారిపై బలవంతంగా లైంగిక వేధింపులకు ప్రయత్నిస్తున్న మగాళ్ల బృందం కనిపించింది. ప్రజలు తమ ఫోన్‌లో సంఘటనను రికార్డ్ చేయడం చేశారు.. కాని, వారిని రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
కలకలం రేపిన ఈ వీడియోలో ఇద్దరు స్త్రీలు పార్క్ చేసిన గూడ్స్ బండి వెనుక దాక్కున్నప్పుడు కొంతమంది వారిని పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో మహిళలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కాగా, ఆ మగాల్ల గుంపు వారిని వెంబడించి లాగి బహిరంగంగా వేధించారు. ఇంత జరిగినా ఆ ఇద్దరు మహిళలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, అయితే పోలీసులు వీడియో ఆధారంగా వేధింపులకు పాల్పడిన వారిని వెతకడానికి మాన్‌హాంట్ ప్రారంభించారు. అలీరాజ్‌పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నారు.
వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీని తర్వాత పోలీసులు అదే విషయాన్ని గ్రహించి, గుర్తు తెలియని వ్యక్తులపై మహిళలను వేధించనందుకు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ వీడియోను ధార్‌కు చెందిన ఓ యువకుడు చిత్రీకరించాడని, దాన్ని అలీరాజ్‌పూర్‌కు చెందిన మరో యువకుడు అప్‌లోడ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.
బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్
భగోరియా పండుగ ఆచారాలను ప్రస్తావిస్తూ సమస్య నుంచి తప్పుకోడానికి ప్రయత్నించినప్పటికీ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని మరీ దారుణంగా తయారైందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా మాట్లాడుతూ భగోరియా పండుగ చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన పండుగ. ఇద్దరు మహిళలపై జరిగిన ఘటన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో బాలికలు, మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలియజేస్తుంది అని మండిపడ్డారు. దీనిపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని, బాధితులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.