హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నేరవేరిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఎస్.పి.ఆర్ హిల్స్ లో రూ.1785 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు సురబీ వాణిదేవి, మిర్జా రహమత్ బేగ్, రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ప్రజల సమస్యలను సరైన నాయకుడు మాత్రమే గుర్తించి దాని పరిష్కారానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతారన్నారు. గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్లను సబ్సిడీ ద్వారా మంజూరు చేసిన లబ్దిదారులకు ఉన్న బకాయిలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికేలా 2బీహెచ్ కే డిగ్నిటీ హౌసెస్ ను హైదరాబాద్ లో లక్షకు పైగా నిర్మిస్తున్నామని తెలిపారు. కమలానగర్ లో రెండు బ్లాక్ లలో 7 లిఫ్ట్ లతో మొత్తం 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మొత్తం రూ.16 కోట్ల 27 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో చేపట్టారని, రూ.157.50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కాలనీకి 100 కె.ఎల్ లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటుగా 15 షాపులు కూడా ఏర్పాటు చేశారన్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లుకు రూ. 8,50,000 వ్యయం చేయడం జరిగిందన్నారు. 89 మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేపట్టామని, మిగతా 121మందికి స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు పరిశీలించి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. స్థానికంగా నివాసముండి ఆధార్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత క్రమంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించడం జరుగుతుందన్నారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో 15 షాప్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ షాపుల ద్వారా వచ్చే అద్దెను మెయింటెనెన్స్ కోసం వినియోగించడం జరుగుతుందని తెలిపారు. నోటరి ఇళ్లలో నివసిస్తున్న పేద ప్రజలకు 58 జివో ద్వారా ఇళ్ల పట్టాలను అందజేస్తామని తెలిపారు. బస్తీవాసులకు బస్సు సౌకర్యం, మంచినీటి వసతి, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో దళారులను నమ్మి డబ్బులను ఇవ్వకూడదని, వీటిని పారదర్శకంగా అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే మురళీధర్ బాగ్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. త్వరలో ఎర్రగడ్డలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 ఆసరా పింఛన్లు బ్యాంకులో నేరుగా అందజేయడం జరుగుతుందని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ. 1,00,116 లను అందజేస్తుందని, కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ బిడ్డ పుడితే రూ.13 వేలు నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో పాటు బేబి కిట్ ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాలను అద్బుతంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. కమలానగర్ లో గతంలో ఉన్న ఇళ్ల స్థానంలో అత్యాధునిక వసతులతో నూతన భవన సముదాయాన్ని నిర్మించి పేదవారికి ఉచితంగా అందజేశామని తెలిపారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఐదుగురికి ఇళ్ల పట్టాలతో పాటు తాళం చెవిలు అందజేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ… పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించలేని డబుల్ బెడ్ రూం ఇళ్లను అతి తక్కువ కాలంలో పూర్తి ప్రభుత్వ నిధులతో నిర్మించి పేద ప్రజలకు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. కమలానగర్ ప్రజలు నిరాశ చెందకూడదని, ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను దశల వారిగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత రెవెన్యూ అధికారులు లబ్దిదారుల స్థానికతను పరిశీలించి ఇళ్ల పట్టాలను లాటరీ ద్వారా కేటాయిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినందున ఎంతో మంది పేద ప్రజలు లబ్దిపొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీఓ వసంత, జిహెచ్ఎంసి సి.ఇ సురేష్, ఎస్.ఇ విద్యాసాగర్, ఈఈ వెంకటదాసు, వాటర్ వర్క్స్ సి.జి.ఎం రఘు, యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదిప్య, తదితరులు పాల్గొన్నారు.