మూఢ నమ్మకం అంటే మామూలుగా ఉండదు.. మొన్నటికి మొన్న కేరళలో మనుషులను చంపి కూర వండుకుని తిన్న ఘటన జనాలు ఇంకా మరిచిపోనేలేదు.. ఇంతలో మరో ఘటన వెలుగుచూసింది. ఓ యువతి తన తండ్రి బతికొస్తాడన్న నమ్మకంతో ఓ మగ బిడ్డను బలి ఇవ్వడానిడానికి యత్నించింది. ఈ ఘటన మరెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. శ్వేత (25) అనే యువతి ఈ మధ్యనే తన తండ్రిని కోల్పోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆమె తండ్రి చనిపోయాడు. తాంత్రిక శక్తులపై నమ్మకం ఉన్న శ్వేత… చనిపోయిన తన తండ్రిని బతికించుకునేందుకు ఓ క్షుద్ర పూజారిని ఆశ్రయించింది. అతడు చెప్పిన సలహాతో మగ బిడ్డను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అయితే.. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి వెళ్లిన శ్వేత, అక్కడ ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకుని ఆమె కుటుంబంతో పరిచయం పెంచుకుంది. తనను వారు నమ్మినట్టు నిర్ధారించుకున్నాక తన ప్లాన్ ను అమలులో పెట్టింది. పిల్లవాడిని మళ్లీ తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ శిశువు తల్లి ఈమెను పూర్తిగా నమ్మలేదు. తనతో పాటు తన మేనకోడలు రీతూను కూడా పంపించింది.
కాగా, దారి మధ్యలో రీతూకు శ్వేత ఓ కూల్ డ్రింక్ ఇవ్వగా అది తాగిన ఆ పిల్ల స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత మగశిశువుతో శ్వేత కారులో వెళ్లిపోయింది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన రీతూ… జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత శ్వేతను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందుకోసం 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. మొబైల్ ట్రేస్ టెక్నాలజీని వినియోగించారు. ఎట్టకేలకు శ్వేతను అరెస్ట్ చేసి శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ చిన్నారి క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.