పెళ్లయిన తర్వాత కుమారుడి హోదా ఏ విధంగా కొనసాగుతుందో, అదే విధంగా పెళ్లయిన కుమార్తె హోదా కూడా కొనసాగుతుందని కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. మాజీ సైనికోద్యోగుల పిల్లలకు అందజేసే డిపెండెంట్ కార్డులను పొందే అర్హత విహిహత కుమార్తెలకు లేదని చెప్తున్న సైనిక సంక్షేమ మండలి మార్గదర్శకాలను రద్దు చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జనవరి 2న ఇచ్చిన తీర్పులో, కుమారుడు పెళ్లయినా, కాకపోయినా కుమారునిగానే కొనసాగుతున్నపుడు, కుమార్తెకు పెళ్లయినా, కాకపోయినా, కుమార్తెగానే కొనసాగాలి. కుమారుని హోదాను వివాహం మార్చనపుడు, కుమార్తె హోదాను కూడా మార్చకూడదు అని తెలిపింది.
సైనిక దళాల్లో స్త్రీ, పురుష సమీకరణలు మారుతున్నందున తటస్థంగా ఉండే పదాలను వాడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మాజీ సైనిక ఉద్యోగులను ప్రస్తావించేటపుడు ఎక్స్ సర్వీస్‌మెన్ అనే పదానికి బదులుగా ఎక్స్ సర్వీస్ పర్సనల్ అనే పదాన్ని ఉపయోగించాలని తెలిపింది.
ఏమిటీ వివాదం..
సుబేదార్ రమేశ్ ఖండప్ప పోలీస్ పాటిల్ 2001లో ‘ఆపరేషన్ పరిక్రమ్’లో భాగంగా మందుపాతరలను తొలగిస్తుండగా మరణించాడు. ఆయన కుమార్తె ప్రియాంక పాటిల్ డిపెండెంట్ కార్డుకోసం ప్రయత్నించగా, మంజూరు కాలేదు. దీంతో ఆమె న్యాయస్థాన్ని ఆశ్రయించారు. తండ్రి మరణించే నాటికి ప్రియాంక వయసు 10 సంవత్సరాలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ జరిగింది. మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు నిబంధనలు పేర్కొన్నాయి. దీంతో ఆమె డిపెండెంట్ కార్డ్ కోసం ప్రయత్నించారు. ఈ కార్డును మంజూరు చేయడానికి సైనిక సంక్షేమ మండలి తిరస్కరించింది. ఆమెకు వివా#హమైనందున ఈ కార్డును మంజూరు చేయబోమని తెలిపింది. వివాహం కానటువంటి మహిళలకు మాత్రమే డిపెండెంట్ కార్డులను మంజూరు చేయాలని నిబంధనలు చెప్తున్నట్లు తెలిపింది. దీంతో ఆమె 2021లో హైకోర్టును ఆశ్రయించారు.
నిబంధనలు మార్చుకోండి..
మహిళలకు డిపెండెంట్ కార్డుల జారీ విషయంలో సైనిక సంక్షేమ మండలి నిబంధనలు రాజ్యాంగ అధికరణలు 14, 15లకు విరుద్ధంగా ఉన్నట్లు జస్టిస్ నాగ ప్రసన్న తన తీర్పులో చెప్పారు. దశాబ్దాల క్రితం అమల్లో ఉన్న మూస ఆలోచనా విధానం ఈ నిబంధనల్లో కనిపిస్తోందన్నారు. ఈ నిబంధనలను ఇలాగే కొనసాగనిస్తే, స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించే మార్గంలో కాలం చెల్లిన అడ్డంకులుగా నిలుస్తాయన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం 2021 ఆగస్టు 26న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రియాంకకు రిజర్వేషన్ ఫలాలను అందజేసే విషయాన్ని పరిశీలించాలని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీని జస్టిస్ ఎం నాగ ప్రసన్న ఆదేశించారు.