Saturday, September 14, 2024

AP: చెట్ల పొద‌ల్లో చిన్నారి! చ‌ల‌నం లేని అమ్మ‌..

రెండ్రోజుల‌పాటు త‌ల్లి మృత‌దేహంపైనే
ఆక‌లితో అల‌మ‌టించి, విల‌పించింది
ఏడ్చి ఏడ్చి క‌న్నీరు ఇంకింది
జోలె నుంచి కిందికి జారి రోడ్డుమీద‌కు
చిన్నారిని చూసి కాపాడిన స్థానికులు
మ‌హిళ ఆత్మ‌హ‌త్య వెలుగులోకి
అర‌కులోయ మండ‌లంలో ఘ‌ట‌న‌
ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, అర‌కులోయ : అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మ, పద్మాపురానికి చెందిన కొండకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తెను వెంటబెట్టుకొని పద్మ.. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అర‌కులోయ మండ‌లం పానిరంగినిలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడ అందరితో కలిసి భోజనం చేసింది. అయితే.. వాళ్లంతా పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి పద్మ, ఆమె కుమార్తె కనిపించలేదు.

- Advertisement -

ఇంటికి వెళ్లిందేమో అనుకున్న బంధువులు..
పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని బంధువులు భావించారు. చివరకు శుక్రవారం ఉదయం రెండేళ్ల చిన్నారి ఏడ్చుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. దీంతో స్థానికులు ఆ పాప తల్లిదండ్రులు ఎవరు ? పాప ఒక్కతే ఎలా వచ్చిందని చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని పొదల్లో ఉన్న ఓ చెట్టుకు తాడుతో వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. చుట్టుపక్కల గాలించగా ఆమె తన బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

రెండ్రోజులుగా త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద‌నే..
అయితే.. ఆ చిన్నారి రెండు రోజుల పాటు తల్లి వీపుపై వస్త్రంలోనే వేలాడింది. తన అమ్మకు ఏం జరిగిందో తెలియదు. ఆకలితో అలాగే ఏడ్చింది. ఎంత ఏడ్చినా చుట్టూ అడవి కావడంతో ఎవరికి ఆ అరుపులు వినిపించలేదు. దీంతో ఎలాగో తల్లి వీపుపై ఉన్న వస్త్రం నుంచి కిందకు దిగి మెల్లగా ముందుకు పాకుకుంటూ వెళ్లింది. అక్కడ స్థానికుల కంట పడటంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. రెండు రోజులు అక్కడే ఉండటంతో పురుగులు, దోమలు కుట్టి అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి తల్లి పద్మ అనుమానాస్పద మృతికి గల కారణాలపై విచారణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement