ఓ ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 15మంది మృతిచెందిన విషాద ఘటన కెనడాలో నిమానిటోబా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. మానిటోబా ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతంలోని హైవే కూడలిలో 25 మంది ప్రయాణికులతో క్యాసినో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరో 10 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన బస్సులో ఉన్న వారంతా వయో వృద్ధులని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కెడనా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. మానిటోబా ప్రమాదం చాలా విషాదకరమైందన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.