ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్ష నేతలు, అని పరోక్షంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. 60లక్షల మంది గులాబీ దండుకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. 22 ఏండ్ల క్రితం హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌గా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్‌ఎస్ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ నమ్మారని తెలిపారు. అర్ధబలం, అంగబలం లేకున్నా తెలంగాణ కోసం బయలుదేరారని తెలిపారు. అంతకు ముందు నేతలు తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదని చెప్పారు.
అయితే ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని వెల్లడించారు. 2013లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నా.. తెలంగాణలోనే అడుగుపెడతానని కేసీఆర్ చెప్పారని, అన్నట్టుగానే తెలంగాణ సాధించి తిరిగి వచ్చారని వెల్లడించారు. లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్ జన్మదన్యమైందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్లముందే ఉందన్నారు.తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. 2018లో ప్రతి కార్యకర్త తానే అభ్యర్థినన్నట్టు పనిచేశారని, సిరిసిల్లలో తనను 89 వేల మెజార్టీతో గెలిపించారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆదమరిస్తే పచ్చని పందిరిలో పాము జొర్రిందని బీజేపీని ఉద్దేశించి అన్నారు. సిరిసిల్లలో రూ.400 కోట్లతో అపారెల్ పార్కును నిర్మిస్తున్నామన్నారు. ఈ పార్కులో వర్కర్ టూ ఓనర్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.సిరిసిల్లలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, డిగ్రీ కాలేజీ, మెడికల్ కాలేజీ, అద్భుతంగా రహదారులు, బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని గంభీరావుపేటకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చిందని చెప్పారు. గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్‌ను వేదికపైకి పిలిచి అభినందించారు. ఇది గోల్‌మాల్ గుజరాత్ కాదు.. గోల్డెన్ తెలంగాణ అని చెప్పారు.