వామ్మో స్పైస్ జెట్, ఇండిగో విమానాలు అంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే మూడు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఒక విమానంలోని ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఆకస్మాత్తుగా దాన్ని ఆపేసి.. ప్రయాణికులను బయటికి పంపించారు. ఇంకో విమానానికి పక్షి ఢీకొట్టడంతో ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. మరో విమానం 6వేల అడుగుల ఎత్తుకు చేరినా క్యాబిన్ ప్రెజర్లో సమస్య పోలేదు.. దీంతో దాన్ని కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది..
ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి మూడు విమాన ఘటనలు నమోదయ్యాయి. స్పైస్‌జెట్ విమానం ఎడమ రెక్కకు మంటలు అంటుకోవడంతో పాట్నాలోని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. మొత్తం 185 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే అది స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 727 అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
పాట్నా-ఢిల్లీ స్పైస్‌జెట్ విమానాన్ని పక్షి ఢీకొన్న ఘటనలో ఇంజిన్ 1 విఫలమైందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధ్రువీకరించింది. ఈ ఘటనలోనూ మొత్తం 185 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్ 1ని పక్షి ఢీకొట్టిందని అనుమానించారు. అయితే అది మామూలే అనుకుని సిబ్బంది పెద్దగాపట్టించుకోలేదు. అట్లనే విమానం మరింత పైకి వెళ్లింది. ఆ సమయంలో ఇంజిన్ 1 నుండి స్పార్క్ లు రావడం గమనించారు క్యాబిన్ సిబ్బంది. తర్వాత, వారు పైలట్-ఇన్-కమాండ్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
మరో సంఘటనలో.. జబల్‌పూర్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ఆదివారం 6,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పటికీ క్యాబిన్ ప్రెజర్ డిఫరెన్షియల్‌ను తిరిగి పొందడంలో విఫలమైనందున తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. Q400 విమానం SG-2962లో ఉన్న సిబ్బంది ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ సమయంలో క్యాబిన్ ఎత్తు పెరగడంతో పాటు క్యాబిన్ ప్రెజర్ డిఫరెన్షియల్ పెరగడం లేదని గమనించారు.
ఈ విమానం 6,000 అడుగుల ఎత్తులో చేరినా.. కావాల్సినంత ప్రెజర్‌ని పొందలేదు. పైలట్ ఇన్ కమాండ్ ఢిల్లీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారి తెలిపారు.
కాగా, మూడవ సంఘటనలో.. గౌహతి నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (6E 6394) టేకాఫ్ తర్వాత అనుమానాస్పద పక్షి ఢీకొనడంతో గౌహతి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఢిల్లీకి వెళ్లే మరో విమానంలో ప్రయాణికులందరికీ వసతి కల్పించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ను తనిఖీ చేస్తున్నామని ఇండిగో అధికారి చెప్పారు.