పరేఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్ అనే సంస్థ పలు బ్యాంకులను మోసం చేసి.. దాదాపు రూ. 2296.58 కోట్ల రుణం తీసుకుంది. అయితే.. ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో.. ఆ సంస్థపై 2018లో మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసును ఈడీ విచారిస్తుంది. ఈ విచారణలో భాగంగా.. ఆ సంస్థకు సంబంధించిన రక్షా బులియన్, క్లాసిక్ మార్బల్స్ కంపెనీ పేర్ల మీద కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించింది, అలాగే.. ఈ సోదాల్లో కొన్ని రహస్య లాకర్ల తాళాలు లభ్యమైనట్లు ఈడీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆ రహస్య లాకర్లను తెరిచిన అధికారులకు దిమ్మ తిరిగింది. ఆ లాకర్ల లో నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి బయటపడింది.
అలాగే.. ఎటువంటి నిబంధనలను పాటించకుండా లాకర్లు నడుస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, కేవైసీ అనుసరించబడలేదు, ఆ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చలేదు, ఆ లాకర్లను తీయడానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారనే సమాచారం తెలిపే సరైన రిజిస్టర్ కూడా నిర్వహించలేదని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆ కాంప్లెక్స్ లో మొత్తం 761 లాకర్లు ఉండగా.. వాటిలో మూడు లాకర్లు రక్షా బులియన్‌కు చెందినవిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. మొదటి రెండు లాకర్లను తెరవగా అందులో 91.5కిలోల బంగారు కడ్డీలు, 152 కిలోల వెండి గుర్తించామనీ.. మరో లాకర్‌లో 188కిలోల వెండి (మొత్తంగా 340 కిలోలు) ఉందని ఈడీ అధికారులు వివరించారు. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.47.76 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి 2019లో ఈడీ అధికారులు రూ.205 కోట్లు అటాచ్ చేశారు.