హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్తగా ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు సుమారు తొమ్మిది లక్షల మంది ఎదురు చూస్తున్నారు. రెండేళ్ళ క్రితం వివిధ కేటగిరిలలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా గత ఏడాది దరఖాస్తు చేసిన 57 ఏళ్ళు నిండిన వారు కూడా కలిపి సుమారు పదిహేను లక్షల మంది వరకు ఉంటారని అంచనా. పింఛన్ నిబంధనల మేరకు ఒంటరి మహిళలు, ప్రమాదాల కారణంగా దివ్యాంగులుగా మారిన వారు, ఫైలేరియా, హెచ్‌ఐవి బాధితులు, 50 ఏండ్లు నిండిన గీత – నేత కార్మికులు, అప్పటి పాత నిబంధనల మేరకు 65 ఏళ్ళు నిండిన వారు 2018 నుంచి 2020 డిసెంబర్ వరకు మూడు లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో ఒక లక్షా 20 వేల మంది అర్హులను గుర్తించినప్పటికీ 80 శాతం మందికి పింఛన్లు మంజారు చేయడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసరా పింఛన్ అర్హుల వయస్సును 65 ఏళ్ళ నుంచి 57 ఏళ్ళకు తగ్గిస్తున్నట్లు 2020 మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, సుమారు తొమ్మిది లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వాస్తవానికి దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి లబ్ధిదారులకు పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం భావించింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో మార్గదర్శకాల విడుదల జాప్యం వంటి కారణాల వలన అలస్యమైంది. వచ్చే ఏప్రిల్ , మే నెల నుంచి అర్హులైన లబ్ధిదారులందరికి పింఛన్ల మంజూరు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత ఏడాది బడ్జెట్‌లో పింఛన్ల కోసం రూ.11.750 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో రూ.11.750 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో పింఛన్ అర్హత వయస్సు తగ్గించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కలిపి లబ్ధిదారుల సంఖ్య దాదాపు 47 లక్షలకు చేరింది. గతం కంటే అర్హులైన లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.ఈసారి బడ్జెట్‌లో ఒక రూపాయి కూడా నిధులు పెంచలేదు. ఈ క్రమంలో కేటాయించిన రూ.11.750 కోట్లు సరిపోతాయా? కొత్త పింఛన్‌దారులకు నిరాశే ఎదురవుతుందనే ఆందోళనలో దరఖాస్తుదారులు ఉన్నారు.