మన దేశం రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. చౌకగా లభిస్తున్నందున రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో భారత్, చైనాలు పోటీలు పడి దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా నుంచి మన దేశానికి ప్రతి నెల ముడి చమురు దిగుమతులు పెరుగుతున్నాయి. మే నెలలో ఇది 14 శాతం పెరిగిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. రష్యా ఎగుమతి చేస్తున్న మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో భారత్, చైనాలే 80 శాతం దిగుమతి చేసుకుంటున్నాయని పేర్కొంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి ముందు రష్యా నుంచి ముడి చమురు ఎగుమతులు ప్రధానంగా యూరోపియన్ దేశాలకే జరిగేది. ఆసియా దేశాలకు 34 శాతం ఎగుమతులు మాత్రమే జరిగేవి. అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఈ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రష్యా నుంచి ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఆసియా దేశాలకు జరుగుతోంది. రష్యా ముడి చమురును చౌకగా సరఫరా చేస్తుండడంతో మరికొన్ని ఆసియా దేశాలు కూడా రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
మే నెలలో రష్యా రోజుకు 3.87 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. చైనా 2.2 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుంది. మే నెలలో మన దేశం మొత్తం చమురు అవసరాల్లో 45 శాతం రష్యానే తీరుస్తోంది. ఏప్రిల్ నెలతో పోల్చితే రష్యా నుంచి చమురు దిగుమతులు 14 శాతం పెరిగాయి. చైనా మొత్తం అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు 20 శాతానికి చేరాయి. చాలా యూరోపియన్ దేశాలు నేరుగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోలేని పరిస్థితులు ఉండడంతో భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు, గ్యాస్‌లో కొంత భాగం యూరోపియన్ దేశాలకు తిరిగి ఎగుమతి అవుతోంది.