Friday, November 22, 2024

గోదావరి గలగలలు.. శ్రీరాంసాగర్‌ నుంచి పరుగులు..

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెకు నుంచి గోదారమ్మ పరవళ్లు పెడుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరడంతో అధికారులు ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండడంతో గడిచిన కొన్ని రోజులుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్ జల కళ సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జూలై నెలాఖరులోపే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది.

జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గురువారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 8 గేట్లను ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,32,325 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 84.810 టీఎంసీల నీరు ఉంది. వరద మరింత పెగితే మరి కొన్ని గేట్లను ఎత్తనున్నారు.

గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో కేవలం 33 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతి భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి దాదాపు 84 టీఎంసీలకు చేరుకుందని చెప్పారు. పైనుంచి వచ్చే వరద ఆధారంగా నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: గోదావరికి వరద ఉద్ధృతి.. మందస్తు చర్యలకు సీఎం ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement