దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో భూములు బంగారమయ్యాయి. ప్రజలంతా తమ పెట్టుబడికి భూమి సురక్షితమని భావిస్తున్నారు. ఐటీ నిపుణుడినుంచి ప్రభుత్వ ఉన్నతాధికారి వరకు ఇప్పుడు వ్యవసాయ భూములు, ప్లాట్లపై పెట్టుబడి పెట్టి రాష్ట్ర సంపద పెంపులో భాగస్వామ్యమవుతున్నారు. తద్వారా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో స్థిరాస్తులపై దాదాపు రూ.100 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను పారించారు. ఏడాదికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ అటూఇటుగా రూ. 2.5 లక్ష కోట్లుగా ఏడాదికేడాది పెరుగుతూ వచ్చింది. అయితే దీనికి ఈ ఐదేళ్లలో 40రెట్లు అదనంగా భూములు, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు సాగాయి. ఈ మేరకు ఈ ఐదేళ్లలో తెలంగాణలో ఒక్క రిజిస్ట్రేషన్ రంగంలోనే రూ. 100 లక్షల కోట్లకుపైగా నగదు వరదలా పారింది. ఇదంతా కేవలం ప్రభుత్వం నిర్ధేశించిన బుక్ వ్యాల్యూనే. అంటే దాదాపు ఏడేళ్లలో రూ. లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడులు పారినట్లుగా లెక్కలు ధృవీకరిస్తున్నాయి.
హైదరాబాద్ , ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, అభివృద్ధి తీరును గమనిస్తున్న పెట్టుబడిదారులతోపాటు సాధారణ ప్రజలు కూడా తమ పెట్టుబడులను స్థిరాస్తి రంగంవైపు మళ్లిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేళ్లూనుకుంటున్న సమ్మిళిత అన్ని రంగాల పురోభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పురపాలికలు వంటి ప్రత్యక్ష చర్యలు, ఇతర పరోక్ష కారణాలు కూడా భూములపై పెట్టుబడులకు కీలక మార్గమవుతోంది. తాజగా నెలకొన్న ఆర్ధిక ఒడిదుడుకులు, బ్యాంకుల దివాళా, నగదు తిప్పలు, కరోనా సంక్షోభ స్థితిగతులను, ఆర్ధిక మోసాలను చూస్తూ విసిగిన సామాన్యుడు మొదలు బడా పెట్టుబడిదారుల వరకు తమ పెట్టుబడులకు భూమైతేనే సురక్షితమని, ధరలు పెరుగుడే తప్పా తమ పెట్టుబడికి ఢోకా ఉండదని గుర్తించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇందుకు అనువుగా మార్చుకుని భూములను కొనుగోలు చేస్తున్నారు. అందుకే తెలంగాణలో భూములు, ఆస్తులపై పెట్టుబడుల వరద పారుతోంది. వడ్డీలు, వ్యాపారాలు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పైనాన్స్, చిట్స్, షేర్ మార్కెట్ కంటే తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారానికి ఢోకా లేదని పెద్దపెద్ద సంస్థలూ భావించాయి. అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏకంగా రిజిస్ట్రేషన్ రాబడి రూపంలోనే రూ. 43,500 కోట్ల రాబడి ఖజానాకు చేరింది.
స్థూల ఆర్ధిక వృద్ధిలో అపూర్వ ప్రగతి దిశగా అడుగులు వేస్తోన్న తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కీలక స్థానం ఉంది. యేటాటా రూ. 4వేల కోట్లకుపైగా రాబడినిస్తున్న ఈ శాఖ ప్రజల్లో దాదాపు ఏడాదికి రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ను చేతులు మార్చేలా చూస్తోంది. అయితే ఏడాదిలో రెండు దశల్లో మార్కెట్ విలువల పెంపుతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఈ శాఖ వర్గాలు అంటున్నాయి. తాజాగా ఇ చాలాన్ మాడ్యూల్, సొంత నెటవర్క్‌తో సర్వర్ ఆధునీకరణ, మెరుగైన సేవలు, ఆధునిక సాంకేతికత, వీడియో రికార్డింగ్, ఆన్‌లైన స్లాట్ బుకింగ్, ఇంటివద్దే సేవలు, పోస్టాఫీసుల్లో స్టాంపుల విక్రయాలు, ఆధార్ అనుసంధానం వంటి అత్యున్నత సేవలను అందిస్తూ పారదర్శకత, అవినీతిరహిత విధానాలను రిజిస్ట్రేషన్ల శాఖ అవలంభిస్తోంది. తద్వారా భారీగా రాబడి పెరగడంతోపాటు, ప్రజల్లో మోసాలకుఅవకాశం లేని విధానంపట్ల భరోసా కల్పించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెరిగాయి. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఏడాదిలో కూడా గణనీయమైన వృద్ధిరేటును సాధించింది. ఈ ఆర్ధిక ఏడాదిలో రికార్డు స్థాయిలో 19.67 శాతం వృద్దిరేటును నమోదు చేసుకుని దాదాపు రూ. 11,500 కోట్లను ఆర్జించింది.
నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతోపాటు రూ. 2లక్షలకు మించిన నగదు లావాదేవీలపై కేంద్రం కఠిన నిర్ణయాలను అధిగమించిన తర్వాత పెట్టుబడి దారులు ఈ రంగంలోకి వెల్లువలా తరలారు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రియల్ రంగం దశ తిరిగింది. మార్కెట్ ధరకంటే ఎక్కువ ధరకు ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో భారీ రాబడి కూడా పెరిగింది. 2012-13 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ శాఖ ద్వారా రూ. 2819.31 కోట్లు ఖజానాకు రాబడి సమకూరింది. అదేవిధంగా 2013-14లో రూ. 2589.62 కోట్ల రాబడి, 2014-15లో రూ. 2531.05కోట్లు, 2015-16లో రూ.3786.97కోట్లు, 2016-17లో రూ.4249కోట్లు, 2017-18లో రూ.5177 కోట్లు ఖజానాకు చేరింది. ఇలా 2020-21లో రూ. 5260కోట్లకు చేరి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ. 11,500కోట్లకు చేరుకుంది.
ఏడాది డాక్యుమెంట్లు రాబడి(రూ. కోట్లలో..
2015-16 1062108 3786
2016-17 1063263 4249
2017-18 1150415 5177
2018-19 1532980 6612
2019-20 1658815 7061
2020-21 1210960 5260
2021-22 1797803 11500
కాగా ఈ ఏడాది స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అద్భుత రికార్డును సొంతం చేసుకున్నది. రాష్ట్ర ఆవిర్భావ ఏడాది(2014-15)లో రూ. 2500కోట్ల వార్షిక రాబడిలో ఉన్న రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2021-22 మార్చి 2నాటికి సరికొత్త చరిత్రను సృష్టించి రూ. 11,489.87కోట్లకు చేరుకుంది. గతేడాది (2020-21)లో 12 నెలల ఆదాయం రూ. 5260.20కోట్లుకాగా, అంతక్రితపు ఏడాది 2019-20లో రూ. 7061కోట్లను సాధించింది. 2018-19లో రూ. 6612కోట్ల రాబడిని ఆర్జించింది. 2020-21లో కరోనా తీవ్రత నేపథ్యంలో భారీగా రాబడి తగ్గినప్పటికీ, 2021-22లో రెండు దశల్లో పెంచిన మార్కెట్ విలువలు, ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ రుసుములతో రాష్ట్ర రాబడి ద్విగుణీకృతమవుతున్నది.
ఈ ఏడాది ఇప్పటివరకు 17.97,803 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఇందులో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 6.80లక్షలుగానూ, రాబడి రూ. 1450కోట్లుగానూ నమోదైంది. రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు, రాబడిలో రంగారెడ్డి, మేడ్చేల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలు తమ హవాను కొనసాగించగా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్‌లు వెనుకంజలో నిల్చాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 2020-21లో 12.11లక్షల డాక్యుమెంట్లు, 2019-20లో 16.59లక్షల డాక్యుమెంట్లు, 2018-19లో 15.20 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
రియాల్టీతోపాటు, వ్యవసాయ రంగానికీ మంచి రోజులు..
కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రియల్ బూమ్ వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ధీటుగా అన్ని జిల్లాల్లో భూములకు మంచి ధర పలుకుతోంది. క్రయవిక్రయాల జోరు పెరగడం, మార్కెట్ ధరకంటే వాస్తవ ధరలకు ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో భారీగా రాబడి పెరిగింది.