Tuesday, November 26, 2024

Breaking: అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా అరెస్టు.. 7 కోట్ల ఫేక్​ కరెన్సీ సీజ్​

నకిలీ నోట్లను ముద్రించి పంపిణీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ముంబై పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి ₹ 7 కోట్ల విలువైన  నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు టీమ్​ లీడ్​ చేసిన డీసీపీ సంగ్రామ్‌సింగ్ నిషాందర్ తెలిపారు.  తమకు అందిన కచ్చితమైన సమాచారం మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ -11వ యూనిట్ నిన్న సాయంత్రం శివారులోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద కాపలా కాసిందని, ఒక కారును ఆపి  అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైందన్నారు.  క్రైమ్ బ్రాంచ్ స్లీపర్​ సెల్​ ఆధ్వర్యంలో సోదాలు జరిపిన సమయంలో ₹ 5 కోట్ల  విలువ కలిగిన 250 నకిలీ కరెన్సీ నోట్లు (₹ 2,000 డినామినేషన్‌లో) ఉన్న బ్యాగ్‌ దొరికిందని తెలిపారు.  కాగా, కారులో ఉన్న ఆ నలుగురిని విచారించగా మరో ముగ్గురు సహాయకుల గురించి సమాచారం అందించారని వివరించారు.

దీని ప్రకారం సబర్బన్ అంధేరి (పశ్చిమ)లోని ఒక హోటల్‌లో పోలీసు బృందం దాడి చేసి మరో ముగ్గురిని అరెస్టు చేసింది.  మరో 100 నకిలీ కరెన్సీ నోట్ల కట్టలను (మళ్లీ ₹ 2,000 డినామినేషన్‌లో) అంటే దాదాపు ₹ 2 కోట్ల  విలువైనవి లభించినట్టు వెల్లడించారు.  ముఠా సభ్యుల నుంచి నకిలీ నోట్లతో పాటు ఒక ల్యాప్‌టాప్, ఏడు మొబైల్ ఫోన్లు, రూ. 28,170 నిజమైన కరెన్సీ, ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. విచారణలో భాగంగా అంతర్రాష్ట్ర ముఠా నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి పంపిణీ చేసే రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఆపరేషన్‌ను పర్యవేక్షించిన డీసీపీ సంగ్రామ్‌సింగ్ నిషాందర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ. 7 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఏడుగురిని అరెస్టు చేశారని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement