తెలంగాణలో కోలువుల జాతర త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ నిర్ధరించింది. మొత్తం 67వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనుంది. కేబినెట్ ఆమోదంతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి. శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది వివరాలను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67,820 ఖాళీలు తేలాయి. 50 వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ప్రభుత్వ శాఖలోని మొత్తం ఖాళీల సంఖ్య తేలడంతో తర్వలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.