జపాన్ కుబేరుడు హిరోషి మికిటానీ ఉక్రెయిన్ దేశానికి భారీ విరాళాన్ఇన ప్రకటించారు. ఈ-కామర్స్ సంస్థ రాకుటెన్ వ్యవస్థాపకుడైన మికిటానీ… యుద్ధంలో నలిగిపోతున్న ఉక్రెయిన్ కు రూ.65 కోట్లు అందిస్తున్నట్టు ప్రకటించారు. మికిటానీ రష్యా దురాక్రమణను ప్రజాస్వామ్యానికి సవాలుగా అభివర్ణించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీకి లేఖ రాశారు. హింస కారణంగా ప్రభావితమైన ఉక్రెయిన్ ప్రజల పట్ల సౌహార్ద చర్యగా ఈ విరాళం ఇస్తున్నానని తెలిపారు. కాగా, 2019లో తాను కీవ్ ను సందర్శించానని, జెలెన్ స్కీతోనూ భేటీ అయ్యానని మికిటానీ వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభిత పరిస్థితుల్లో తాను ఉక్రెయిన్ ప్రజల పక్షాన నిలుస్తున్నట్టు వివరించారు. శాంతియుత, ప్రజాస్వామ్య దేశమైన ఉక్రెయిన్ ను అన్యాయంగా అణచివేసే ప్రయత్నం చేయడం తనను ఆవేదనకు గురిచేస్తోందని, ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ అంశాన్ని రష్యా, ఉక్రెయిన్ శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement