Tuesday, November 26, 2024

ఊళ్లో వైరస్‌.. ఊరిబయట జనం!

ఆ ఊరంతా చిన్నబోయింది. జనం పెద్ద పెద్ద బంగ్లాలను వదిలి బావుల దగ్గర చిన్న, చిన్న గుడిసెల్లో తలదాచుకుంటున్నారు. కరోనా వైరస్‌ ఊళ్లోకి రావడంతో గ్రామ ప్రజలు ఊరిబయటకు తరలిపోయారు. గ్రామంలో సగం మందికి కరోనా వచ్చింది. ఊరు విడిచి పొలాల్లో ఉంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులేమో పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఎప్పుడు, ఎవరు చనిపోతారోనని భయపడుతున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరా.. మా బతుకు ఇంతేనా..? చావాల్సిందేనా!  అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ వికారాబాద్‌ జిల్లా ఎర్రవల్లి గ్రామస్తులు దయనీయస్థితి.

ఊరి జనాభా 1,400 మంది కాగా, వారిలో సుమారు 600 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో జనమంతా వెళ్లిపోయి తమ తమ వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకొని క్వారంటైన్‌ లో గడుపుతున్నారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో కోఆప్షన్‌ మెంబర్‌ జాఫర్‌ జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడ్చివేయిస్తున్నారు.

గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దొంగలు ఊరి మీదపడి దోచుకుపోయినా అడిగే నాథుడులేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement