మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పంజాబ్ పోలీసులు ఇవ్వాల అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐఎస్ఐ ప్రమేయం ఉందని పంజాబ్ డీజీపీ వీకే భవ్రా వెల్లడించారు. ఈ కేసును తాము ఛేదించామని 2017లో కెనడాకు వెళ్లిన గ్యాంగ్‌స్టర్ లక్బీర్ సింగ్ లండా ఈ ఘటనకు ప్రధాన కుట్రదారుడని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఐఎస్ఐకి సన్నిహితుడిగా పేరొందిన హర్వీందర్ రిందాతో లక్బీర్ సింగ్ లండా కలిసి పనిచేస్తున్నాడని డీజీపీ భవ్రా వెల్లడించారు.
మొహాలీ పేలుళ్ల కేసులో అరెస్టయిన వారిని కన్వర్ బత్, బల్జీత్ కౌర్, బల్జీత్ రాంబో, అనందీదప్ సోను, జగ్దీప్ కాంగ్, నిషాన్ సింగ్‌లుగా గుర్తించారు. పేలుడుకు కారణమైన గ్రనేడ్‌ను నిషాన్ సింగ్ సమకూర్చాడని డీజీపీ తెలిపారు. ఇక సోమవారం రాత్రి మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ భవనం మూడో అంతస్తుపై గ్రనేడ్ దాడిలో స్వల్ప ఆస్తినష్టం వాటిల్లింది. ఈ దాడి భద్రతకు పెను ముప్పని విపక్షాలు భగ్గుమన్నాయి. ఉన్నతస్ధాయి దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.