గత 10 నెలల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ నేరాలకు పాల్పడినందుకు గాను 55 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని తొలగించినట్టు తెలుస్తోంది. ఇందులో చాలమందిని సర్వీస్ నుంచి తొలగించినట్టు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. శిక్ష పడిన వారిలో 17 మంది పోలీసు సిబ్బందిని తొలగించగా, మరో 55 మందిపై ఆరోపణలు రాగా వారిలో 22 మందిని సర్వీస్ నుండి తొలగించినట్టు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అయితే ఇందులో ఒక కానిస్టేబుల్‌ని నిర్బంధ పదవీ విరమణ కూడా చేయించారు. మరో 15 మంది సిబ్బందికి ప్రొబేషన్‌ను రద్దు చేశారు.
ఇక.. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొరసాల నాగేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడిపై కేసు నమోదైంది. సీఐ నాగేశ్వరరావు చర్యలు “అధికారంతో హద్దులేని దుర్వినియోగాన్ని” ప్రతిబింబిస్తున్నాయని, చట్టాన్ని ఉల్లంఘించే అతని పనికి సంబంధించిన ఘటనలు ఉన్నాయని సీవీ ఆనంద్ అన్నారు.
దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వనస్థలిపురంలోని ఓ మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసి చంపేందుకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసులకు సుమారు 30 ఏళ్ల వయస్సున్న బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఇక.. అతను హైదరాబాద్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏప్రిల్ మొదటి వారంలో టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ (హైదరాబాద్ పోలీస్) ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో కొకైన్ దొరికినట్లు ప్రచారం జరిగిన పబ్‌పై దాడి చేశాడు. కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు, టాలీవుడ్ ప్రముఖుల పిల్లలు పట్టుబడటంతో ఈ హై ప్రొఫైల్ కేసు విస్తృతంగా దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న పోలీసుల జాబితాను కూడా పరిశీలించినట్టు సీపీ తెలిపారు.
మహిళలు, పిల్లలపై నేరం కింద ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను డిస్మిస్ చేయగా, ఒకరిని హైదరాబాద్ పోలీసు పరిధిలోని సర్వీస్ నుండి తొలగించారు. ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్ల ప్రొబేషన్ రద్దు చేశారు. ఈ నేరానికి పాల్పడిన ఐదుగురు కానిస్టేబుళ్లలో ముగ్గురిని ప్రొబేషన్ నుంచి తొలగించగా, ఇద్దరిని సర్వీసు నుంచి తొలగించారు.
మినిస్టీరియల్ స్టాఫ్ (రాష్ట్ర క్యాబినెట్)లోని హైదరాబాద్ పోలీసు సిబ్బందిలో ఒకరిని సర్వీస్ నుండి తొలగించగా, మరొకరు ప్రొబేషన్ నుండి తొలగించారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైనందుకు శిక్షించిన 29 మంది పోలీసు సిబ్బందిలో 25 మంది కానిస్టేబుళ్లను తొలగించారు, హైదరాబాద్‌లో అవినీతికి పాల్పడినందుకు మరో ఇద్దరు మినిస్టీరియల్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఇతర దుష్ప్రవర్తన కారణాలతో మరో ఏడుగురు పోలీసు సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించారు.