పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల గెలుపుతో మంచి జోష్ లో ఉన్న అధికార వైసీపీ.. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికపై దృష్టి పెట్టింది. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా..విభేదాలు పక్కనపెట్టి తిరుపతి ఉపఎన్నికలో కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలకు సీఎం జగన్ ఆదేశించారు. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్ధి గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన జగన్… విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితాన్ని దేశం మొత్తం చూస్తుందని, విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలను జగన్ సూచించారు.
కాగా, వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు మార్చి 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి.