Friday, November 22, 2024

5వేల కిలోమీటర్ల రోడ్లు ఆగమాగం.. తుపాన్ తో ఏపీలో భారీగా దెబ్బతిన్న రోడ్లు..

ప్ర‌భ‌న్యూస్ : తుపాన్ కార‌ణంగా రాష్ట్రంలో సంభవించిన జలప్రళయానికి ప్రధానంగా నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున రహదారులు ధ్వంసమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రహదారుల పరిస్ధితి మరింత అధ్వాన్నంగా తయారైంది. కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సుమారు 5వేల కిలో మీటర్ల మేర రోడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ఆకారాన్ని కోల్పోయాయి. గ్రామీణ రోడ్లు, ఆర్‌అండ్‌బి రోడ్లు, పంచాయతీరాజ్‌, బీటీ రోడ్లు, హైవేస్‌ ఇలా అన్ని రకాల రహదారులు వరదలకు ఎక్కడికక్కడ తెగిపోయి, అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. ఒక్క ఆర్‌అండ్‌బిలోనే భారీగా రహదారుల ధ్వంసం జరిగింది.

ఈనెల 26, 27, 28 వ తేదీల్లో మూడు రోజుల పాటు కేంద్ర బృందం వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్న నేపథ్యంలో వారికి అన్ని వివరాలు నివేదించేందుకు సంబంధిత అధికారులు సర్వం సిద్దమవుతున్నారు. ఒక్క ఆర్‌అండ్‌బి పరిధిలోనే 46 వేల కిలో మీటర్ల మేర రహదారులుంటే దాదాపు 5వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు సంబంధిత అధికారులు ప్రాధామికంగా తేల్చారు. ఇవి కూడా ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్ల్లాల్లోనే దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు 200 ప్రదేశాల్లో రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. బ్రిడ్జీలు,రోడ్డు కట్టలు, కాజ్‌వేలు,కల్వర్టులు వరదలకు కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

తాత్కాలికంగా ఎక్కడికక్కడ గ్రావెల్‌తో రిపేర్లు చేసి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఇలా ఆ నాలుగు జిల్లాల్లో 40 శాతం మేర రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇంకా 60 శాతం మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. దాంతో ఇంకా చాలా గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయంటున్నారు. నాలుగు జిల్లాల్లో 250 బ్రిడ్జీలు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. మరో 400 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 190 చోట్ల ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. వరద ప్రవాహం తగ్గిన తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా మళ్లి వాయుగుండం ఏర్పడడంతో సర్వత్రా అందోళన చెందుతున్నారు. ఈలోపు కేంద్ర బృందం కూడా వస్తుండడంతో ఆర్‌అండ్‌బి ఉన్నతాధికారులు వారికి పరిస్ధితి, నష్టం వివరాలు నివేదిం చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

కేంద్రం నుంచి నిధులు వస్తే తప్ప రోడ్లు బాగుపడే పరిస్ధితి లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు తయారు చేసి, కేంద్రానికి అందజేసేందుకు రంగం సిద్దం చేస్తుంది. కాగా కొన్ని ప్రాంతాల్లో ఏకదాటిగా 5 కిలో మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందని అధికారులు అంటున్నారు. పించ, అన్నమయ్య ప్రాజెక్టులతో పాటు సమీపంలోని చెరువులన్నీ తెగడంతో ఆయా గ్రామాల్లోని రోడ్లన్నీ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. ఆరెండు ప్రాజెక్టు వల్లనే ఎక్కువ శాతం రోడ్లు పాడయ్యాయని అధికారులు అంటున్నారు. చిత్తూరు, కడప జిల్లా రాజంపేట, పులివెందుల ఏరియాల్లో రోడ్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు రూ. 30 కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement