Friday, November 22, 2024

RBI | చలామణిలో 500 నోట్లే అధికం, ఆగని న‌కిలీ నోట్లు.. ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడి

దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 2022-23 ఆర్ధిక సంవత్సంలో 7.8 శాతం పెరిగిందని మంగళవారం ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్లు తెలిపింది. చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువలో 500 నోట్లు, 2000 నోట్ల విలువ 87.9 శాతం ఉన్నట్లు తెలిపింది. 2021-22లో ఇది 87.1 శాతంగా ఉన్నట్లు ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐ 2000 నేట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది.
– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

2023 మార్చి 31 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నోట్లలో సంఖ్యాపరంగా 500 నోట్లు అధికంగా ఉన్నాయి. మొత్తం నోట్లో వీటి వాటా 37.9 శాతంగా ఉంది. దీని తరువాత 10 రూపాయల నోట్లు 19.2శాతం ఉన్నాయి. మొత్తం 5,16,338 లక్షల 500 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇలా చలామణిలో ఉన్న 500 నోట్ల విలువ 25,81,690 కోట్లు. దేశంలో మార్చి 31 నాటికి 4,55,468 లక్షల 2వేల నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల మొత్తం విలువ 3,62,220 కోట్లు. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2 వేల నోట్ల సంఖ్య 1.3 శాతం తగ్గింది. ప్రస్తుతం 2,5,10,100, 200, 500, 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం 50 పైసలు, 1, 2, 5,10 రూపాయల నాణలు చలామణిలో ఉన్నాయి.

ఇ-రూపీ చలామణి..
ఆర్బీఐ 2022-23 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఇ-రూపీని చలామణిలోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న హోల్‌సేల్‌ ఇ-రూపీ 10.69 కోట్లు, రిటైల్‌ ఇ-రూపీ విలువ 5.70 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తన నివేదిక వెల్లడించింది.
కొత్త నోట్ల కోసం 2022-23లో కేంద్ర ప్రభుత్వం 4,682.80 కోట్లు ఖర్చు చేసింది. క్రితం సంవత్సరం ఈ విలువ 4,984.80 కోట్లుగా ఉంది. కొత్త నోట్ల ముద్రణ 2021-22 సంవత్సరంతో పోల్చితే 2022-23లో 1.6 శాతం పెరిగింది. 2000 నోట్లను అంతకు ముందు సంవత్సరం మాదిరిగానే ఈ సారి ముద్రించలేదు.

- Advertisement -

ఆగని నకిలీ నోట్లు …
దేశంలో నకిలీ నోట్లు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తగ్గాయని తెలిపింది. 10 రూపాయల విలువ చేసే నకిలీ నోట్లు 11.6 శాతం, వంద రూపాయల నోట్లలో 14.7 శాతం, 2వేల నోట్లలో నకిలీ నోట్లు 27.9 శాతం తగ్గాయని ఆర్బీఐ తెలిపింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంక్‌ల్లో గుర్తించిన నకిలీ నోట్లలో 4.6 శాతం ఆర్బీఐలో, 95.4 శాతం బ్యాంక్‌ల్లో ఉన్నాయి. నకిలీ నోట్లలో 500 రూపాయలనోట్లే అధికంగా ఉన్నాయి. 91.110 నకిలీ 500నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. 2022లో మొత్తం 2,30,971 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2022-23లో 2,25,769 నకిలీ నోట్లను గుర్తించారు.


బలమైన స్థూ ఆర్ధిక విధానాలు, కమొడిటీ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో భారత ఆర్ధిక వృద్ధి 2023-24లోనూ కొనసాగుతుందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గుముఖం పడుడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆర్ధిక వృద్ధిలో మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సవాల్‌ విసురుతున్నాయని పేర్కొంది. మరోవైపు సర్దుబాటు పరపతి విధాన వైఖరి ఉపసంహరణపై ఆర్బీఐ దృష్టి కొనసాగుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం టార్గెట్‌ పరిధిలోకి వచ్చే వరకు అది తప్పదని పేర్కొంది. స్థిర మారకపు రేటు, సాధారణ వర్షపాతం నమోదైతే ఈ ఏడాది ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. క్రితం సంవత్సరం ఇది 6.7 శాతం ఉంది.

ఆర్బీఐ బ్యాలెన్స్‌షీట్‌ 63.45 లక్షల కోట్లు …
ఆర్బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2.5 శాతం పెరిగి 63.45 లక్షల కోట్లుగా నమోదైందని బ్యాంక్‌ వార్షిక నివేదక వెల్లడించింది. ఆర్బీఐ బ్యాలెన్స్‌షీట్‌ దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దాని కరెన్సీ ఇష్యూ ఫంక్షన్‌తో పాటు ద్రవ్య విధానం, రిజర్వ్‌ మేనేజ్‌మెంట్‌ లక్ష్యాలను అనుసరించి నిర్వహించే కార్యకలాపాలను ఇది ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఆర్బీఐ బ్యాలెన్స్‌షీట్‌ 61,90,302.27 కోట్ల నుంచి 1,54,453.97 కోట్లు పెరిగి 2023 మార్చి 31 నాటికి 63,44,756.24 కోట్లకు చేరింది. ఆర్బీఐ ఆదాయం 47.06 శాతం, ఖర్చు 14.05 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ మిగులు 87,416.22 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో 30,307.45 కోట్లుగా ఉంది. మిగులులో పెరుగుదల 188.43 శాతంగా ఉంది. ఆర్బీఐ తన మిగులుగాఉన్న 87,416.22 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

బ్యాంక్‌ ఎసెట్స్‌లో పెరుగుదల ప్రధానంగా విదేశీ పెట్టుబడులు 2.31 శాతం, బంగారం 15.30 శాతం, లోన్స్‌ అండ్‌ అడ్వాన్స్‌లు 38.33 శాతం పెరుగుదలను నమోదు చేయడంతో వచ్చింది. ఆర్బీఐ కంటిజెన్సీ ఫండ్‌ (సీఎఫ్‌)కు 1.31 లక్షల కోట్లను ట్రాన్స్‌ఫర్‌ చేసింది. బ్యాంక్‌ కొత్త నోట్లను ముద్రించేందుకు 4,682.80 కోట్లను ఖర్చు చేసింది.
2023, మార్చి 31 నాటికి ఆర్బీఐ వద్ద 794.63 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉంది. అంతకు ముందు సంవత్సరం ఇది 760.42 మెట్రిక్‌ టన్నులుగా ఉందని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ 2023 మార్చి 31 నాటికి 2,30,733.95 కోట్లుగా ఉంది. ఇది 2022 మార్చి 31 నాటికి 1,96,864.38 కోట్లుగా ఉందిని ఆర్బీఐ పేర్కొంది.

మరో పేమెంట్‌ సిస్టమ్‌
ఆర్బీఐ మరో చెల్లింపుల వ్యవస్థను తీసుకు రానుంది. ఇంతకు ముందు ఆర్బీఐ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాజాగా లైట్‌ వెయిట్‌ పేమెంటగ్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ (ఎల్‌పీఎస్‌ఎస్‌-ల్యాప్స్‌) పేరుతో ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది రెగ్యులర్‌ పేమెంట్స్‌ విధానం కాదు. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వంటి అనుకోని పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ చెల్లింపుల వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆర్బీఐ తెలిపింది. కొత్త చెల్లింపుల వ్యవస్థ అవసరాన్ని అందులో ఆర్బీఐ తన వార్షిక నివేదికలో ప్రస్తావించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement