Saturday, November 23, 2024

పీజీ మెడికల్‌ సీటు వచ్చినా చేరని 50మంది విద్యార్థులు.. సీట్ల బ్లాకింగ్‌ దందాతోనే ఈ పరిస్థితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మెడికల్‌ పీజీ సీట్ల కు నిర్వహించిన చివరి రౌండ్‌ మాప్‌అప్‌ కౌన్సిలింగ్‌ తర్వాత కూడా తెలంగాణలో భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. మాప్‌అప్‌రౌండ్‌ కౌన్సిలింగ్‌లో సీటు పొందిన దాదాపు 50 మంది దాకా విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయలేదు. దీంతో మెడికల్‌ పీజీ సీట్ల చివరి రౌండ్‌ కౌన్సిలిగ్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. తెలంగాణలోని ప్రయివేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కుమ్మక్కై సీట్లు బ్లాక్‌ చేయించారన్న విమర్శలకు బలం చేకూరుతున్న ఆధారాలు ఒక్కోటిగా స్పష్టమవుతున్నాయి. ఈ మేరకు మనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు 2021-22 విద్యా సంవత్సరానికి మాపప్‌రౌండ్‌లో సీట్‌ అలాట్‌మెంట్‌ అయినప్పటికీ కాలేజీల్లో చేరని విద్యార్థుల జాబితాను సోమవారం కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ లిస్టులో దాదాపు 50 మంది దాకా విద్యార్థులు ప్రయివేటు కాలేజీలో సీటు పొందినా చేరలేదు. ఈ కాఏలజీల్లో ఎంఎల్‌ఆర్‌డీ, ఎంఈడీఐ, సీఏఆర్‌కే, ఎంఎన్‌ఆర్‌ఎస్‌, కేఎంఎన్‌ఐ, ఏపీఎల్‌ఓ తదితర కాలేజీల్లో సీట్లు వచ్చినా చేరని స్టూడెంట్లు కనీసం తక్కువలో తక్కువ అయిదు మంది చొప్పున ఉండటం గమనార్హం. ఈ సీట్లన్నంటినీ మిగిలిపోయిన సీట్ల పేరుతో కోట్లకు ఆయా కాలేజీలు అమ్ముకోనున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి రాష్ట్రంలో ఇఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌ దందా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ దందాపు పలువురు విద్యార్థులు కోర్టుకు వెళ్లగా కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆ మార్గదర్శకాలను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఉద్దేశ్య పూర్వకంగానే అమలు చేయటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్‌లో ఎక్కువ ర్యాంకులు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడి ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. తాము చెప్పినట్లు చేస్తే సీటును అమ్మగా వచ్చిన మొత్తంలో 25శాతం నుంచి 50శాతం వరకు చెల్లిస్తామని ఆశలు చూపుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ రాష్ట్రాల్లో సీట్లు వచ్చినా తెలంగాణకు వచ్చి ఇక్కడి మాప్‌అప్‌రౌండ్‌ కౌన్సిలింగ్‌లో సీటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. వెబ్‌ ఆప్షన్లలో ఇక్కడి ప్రయివేటు మెడికల్‌ కాలేజీలను ముందు వరుసలో ఎంచుకుంటున్నారు. తీరా సీట్‌ అలాట్‌ అయ్యాక గడువు తేదీ పూర్తయ్యే వరకు కళాశాలల్లో చేరడం లేదు. ఇలా మిగిలిపోయిన సీట్లను చివరకు ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు డబ్బున్న వారికి కోట్లలో సాధారణ పేమెంట్‌ సీట్‌ కంటే అయిదారు రెట్ల అధిక ఫీజుకు అమ్ముకుంటున్నాయి.
కాళోజీ వర్సీటీ సహకారంతోనే ప్రయివేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు సీట్ల బ్లాకింగ్‌ దందా చేస్తున్నాయని హెల్త్‌ రిఫార్మ్‌ ్స డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. తాజాగా ప్రయివేటు కాలేజీల్లో సీటు పొందినా దాదాపు 50 మంది వరకు చేరకపోవటంపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌, మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామని అసోసియేషన్‌ అధ్యక్షుడు డా. మహేష్‌ చెబుతున్నారు. సీట్ల బ్లాకింగ్‌ కారణంగా మిగిలిపోయిన దాదాపు ఈ 50 సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కోల్పోయినట్లేనని స్పష్టం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement