Saturday, November 23, 2024

‘కంటి వెలుగు’తో నేటికి 50 ల‌క్షల మందికి ప‌రీక్ష‌లు : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట : సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు అంతటి ముఖ్యమైన కండ్లు కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. దృష్టి లోపాలు ఉన్నా.. చిన్న సమస్యే కదా అని వదిలేస్తూ, కాలం గడుపుతుంటారు. చివరకు అది పెద్ద సమస్యకు దారి తీస్తుంది. దీనికి పరిష్కారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కంటి వెలుగు అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని, నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనతో ప్రారంబించిన కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కంటి వెలుగు నేటికి 50 లక్షల మందికి పరీక్షలు.. ప్రజలకు ఆనంద భాష్పాలు… ప్రతి పక్షాలకు కన్నీటి (కన్నీళ్లు) భాష్పాలు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు లో భాగస్వామ్యం అయిన సహచర మంత్రులకు , శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు , జిల్లా పరిషత్ చైర్మన్ లకు , కార్పోరేషన్ చైర్మన్ లకు, మున్సిపల్ చైర్మన్ లకు, జడ్పిటిసి లకు, ఎంపీపీ లకు , సర్పంచ్ లకు ఎంపీటీసీ లకు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు , శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రుల వద్దకు ప్రజలు రావడం కాదు, ఊరుకు, వాడకు ప్రభుత్వమే కదిలి వస్తున్నది. ఉచితంగా కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఈ కంటి వెలుగును శిబిరాలు కొనసాగుతున్నాయి.

గడిచిన 24 పని దినాల్లో… చేసిన కంటి పరీక్షలు -49,84,821 చేయడం పూర్తి అయ్యింది. కాగా, ఈరోజుతో పరీక్షల సంఖ్య 50 లక్షల మార్కుకు చేరుకున్నది. 25 పని దినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేయడం గొప్ప విషయం. కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న మున్సిపల్, పంచాయతీ శాఖలకు, జిల్లా కలెక్టర్లకు, వివిధ విభాగాల అధికారులకు, ప్రతి ఒక్కరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మన లక్ష్యం చాలా పెద్దది. World’s largest eye screening programmeగా రికార్డు సృష్టించాలని కష్ట పడుతున్నాం అన్నారు. ప్రతి అవ్వకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి కంటి పరీక్షలు నిర్వహించాలి, వారి కంటి సమస్యలను దూరం చేయాలి అన్నదే మన లక్ష్యం అన్నారు. మాకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎలాంటి తారతమ్యం లేదు. మానవత్వం, మనిషితనం ఒక్కటే మాకు కనిపిస్తుంద‌న్నారు. అందుకే కంటి వెలుగు పరీక్షలు చేసుకుంటున్న వారిలో రామ్ ఉన్నడు, రహీమ్ ఉన్నడు, రాబర్ట్ ఉన్నడు. ఎస్సీ ఉన్నడు, ఎస్టీ ఉన్నడు, ఓసీ ఉన్నడు.. స్త్రీలు ఉన్నరు, పురుషులు ఉన్నరు, ట్రాన్స్ జెండర్లు ఉన్నరు అన్నారు. 50 లక్షల్లో 16 లక్షల మందికి కంటి పరీక్షకు ఉన్నట్లు గుర్తించ‌డం జ‌రిగింది. అంటే వీరంతా ఇప్పటి వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న సమస్య కదా అని పట్టించుకోని వారు కొందరైతే, కంటి సమస్య ఇబ్బంది పెడుతున్న ఆసుపత్రికి తీసుకువెళ్లే వారు లేక బాధపడిన వారు కొందరు అన్నారు. కంటి వెలుగు వల్ల వీరందరి సమస్య పరిష్కారం కాగా, పరీక్ష చేయించుకున్న మిగతా వారికి.. మాకు కంటి సమస్య లేదు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక మీదట మరింత జాగ్రత్త వహించాలనే ఆలోచన వచ్చింది.

50 లక్షల పరీక్షల్లో…

పురుషులు – 23,39,863
స్త్రీలు – 26,41,788
ట్రాన్స్ జెండర్ -730

Sc – 8,34,364
St- 4,83,633
Bc- 29,40,923
Oc- 4,87,191
Minority – 2,36,268

- Advertisement -

935512 మందికి రీడింగ్ గ్లాసెస్ అక్కడికక్కడే పంపిణీ చేయగా, ప్రిస్కిప్షన్ కు గ్లాసెస్ రిఫర్ చేసిన 6,49,507 మందిలో 54,324 మందికి ఇంటికి వెళ్లి కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 50 లక్షల మందిలో 34 లక్షల మందికి అంటే 68% ఎలాంటి సమస్యలు లేవు. కంటి పరీక్షలు చేయించుకొని, కళ్లద్దాలు తీసుకున్న ముసలవ్వ ముసలయ్యలు ఎంతో సంతోషపడుతున్నరు. పెద్ద కొడుకు లెక్క మా కళ్లు బాగుచేసాడు కేసీఆర్ అంటున్నరు. వీడియోల్లో చేస్తున్నాం. జనవరి 18న, సీఎం కేసీఆర్ తో పాటు, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయ్ విజయన్ సమక్షంలో ప్రారంభమైన కంటి వెలుగు పై అనేక ప్రశంసలు. ఈ అద్భుత పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని భగవంత్ మాన్, కేజ్రీవాల్ అక్కడే చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మన కంటి వెలుగు అద్బుతం , మా రాష్ట్రంలో కూడా అమలు చేస్తా అన్నాడంటనే ఈ కార్యక్రమం గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఎవరూ అడగకముందే, ఇంటి పెద్ద కొడుకుగా ఆలోచించిన సీఎం కేసీఆర్, దృష్టి లోపాలు సవరించేందుకు 2018 ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్ జిల్లా మల్కాపూర్ లో ప్రారంబించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్యక్రమం బహుశా మరెక్కడా జరిగి ఉండదు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం 8 మందితో కూడిన బృందం కంటి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో ఒక కంటి వైద్యుడు, సూపర్వైజర్ ఆఫీసర్, 2 ఏఎన్ఎంలు, 3ఆశాలు, 1 డీఈవో ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారంలో 5 పని దినాలు పాటు కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ జరుగుతున్నది. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలల పాటు జరిగితే, ఈ సారి వంద పని దినాల్లో రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు గాను, గతంలో 827 బృందాలు పని చేస్తే, ఈసారి 1500 లకు పెంచుకోవడం జరిగింది.

విడతల వారీగా, 16,533 లొకేషన్స్ (రూరల్ – 12,763, అర్బన్ – 3788) లో నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో అందరికీ కంటి పరీక్షలు చేసి, ప్రాథమికంగా 30లక్షల రీడింగ్ గ్లాస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న కళ్లద్దాలు పంపిణీ చేయగా, ఈ సారి మేడిన్ తెలంగాణ కళ్లద్దాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నది. ఈసారి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ మెడికల్ ఎక్విప్మెంట్ పార్క్ లో తయారు చేసిన కళ్లద్దాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. దీని వల్ల ఇక్కడి పరిశ్రమలకు మద్దతు అందటంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం రూ.250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా 950 మంది వైద్యులను కొత్తగా తీసుకున్నది. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నది. శిబిరాలు నిర్వహించే ప్రాంతంలో ఇంటింటికి ఆహ్వాన పత్రిక అందిస్తున్నాము. వైద్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖలు సహా, అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకు అని, కంటి సమస్యలు తొలగించి ఎంతో మేలు చేస్తున్నారని సంబర పడుతున్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పెలా ఇంత పెద్ద కార్యక్రమం కొనసాగుతున్నది. విజవంతంగా కొనసాగిస్తున్న అన్ని శాఖలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మరొక్క సారి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement