ప్రభన్యూస్ : తెలంగాణలో టాటా గ్రూపు చిప్‌ల (సెమీ కండక్టర్ల) తయారీ పరిశ్రమ నెలకొల్పే ప్రక్రియ ప్రాథమిక దశలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిశ్రమ తెలంగాణలో స్థాపిస్తే.. దేశంలోనే చిప్‌ల తయారీకి సంబంధించి తొలి పరిశ్రమగా నిలుస్తుందంటున్నారు. టాటా నెలకొల్పబోయే చిప్‌ల తయారీ పరిశ్రమ భారీగా ఉండనుంది. దీని ద్వారా వేల కోట్ల పెట్టుబడులతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే టాటా సంస్థ 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. దీంతో పాటు ఇక్కడ చిప్‌ల తయారీకి అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ వైపే మొగ్గుచూపే అవకాశం ఎక్కువ అని ప్రభుత్వం భావిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రమ్‌హోమ్ పద్ధతి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌ల వంటి ఎలక్ట్రానిక్స్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా చిప్‌ల కొరత తలెత్తింది. దీంతో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు తయారు చేసే కంపెనీలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు చిప్‌ల కొరతను ఎదుర్కొన్నాయి. దీంతో ఆయా కంపెనీలు తమ ఉత్పత్తినే తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ముడి సరుకు వ్యయం పెరుగుతున్న సమయంలో విక్రయాలు పెంచుకుని లాభాల వృద్ధి కాపాడుకునే పరిస్థితి ఆయా కంపెనీలకు లేకుండా పోయింది. భారత్‌లో వివిధ రంగాలకు కావాల్సిన చిప్‌లను పూర్తిగా దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండడంతో ఇక్కడి కంపెనీలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద కంపెనీ టాటా మోటార్స్‌ను నిర్వహిస్తున్న టాటా గ్రూపు సొంతగా చిప్‌ల తయారీ కంపెనీని నెలకొల్పాలన్న ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ టాటా గ్రూపు చిప్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే పదుల సంఖ్యలో ఎకరాల వరకు స్థలం అవసరం. ప్రస్తుతం ఆదిభట్లలో ఉన్న సెజ్, రావిర్యాలలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ తదితర చోట్ల విరివిగా భూములు అందుబాటులో ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ విమానాశ్రాయానికి, ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉండడంతో కనెక్టివిటీకి ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital