కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఆంటారియో హైవేపై వ్యాన్ ను ట్రాక్టర్ ఢీకొంది. విద్యార్థులు చనిపోయిన విషయాన్ని కెనడాలోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసారియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కెనడాలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుందని… టొరంటో సమీపంలో ఐదుగురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అజయ్ బిసారియా తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల స్నేహితులతో తాము టచ్ లో ఉన్నామని చెప్పారు. మృతులను హర్ ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి జయశంకర్ స్పందించారు. కెనడాలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షించారు.