Tuesday, November 26, 2024

పొలాల్లో గడ్డికోసం వెళ్లిన రైతుపై పులి దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఉత్తరప్రదేశ్​లోని లఖీంపూర్​ఖేరీ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి 40ఏళ్ల వ్యక్తిపై అటాక్​ చేసింది. సౌత్ ఖేరీ ఫారెస్ట్ డివిజన్‌లోని మహేశ్‌పూర్ పరిధిలో ఇవ్వాల (శనివారం) ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకర్‌గంజ్ గ్రామానికి చెందిన వీర్‌పాల్ పశువులకు మేత కోసం చెరుకు తోటకు వెళ్లగా పెద్ద పులి దాడి చేసిందని సౌత్​ఖేరీ డివిజనల్​ ఫారెస్ట్​ ఆఫీసర్​ సంజయ్​ బిస్వాల్​ తెలిపారు.

చుట్టుపక్కల పొలాల్లో పని చేస్తున్న ఇతర రైతులు అతనిని రక్షించడానికి పరుగెత్తడంతో.. పులి అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. వీర్‌పాల్‌ను గోలాలోని ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించినట్టు సంజయ్​ బిస్వాల్​ తెలిపారు.

మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని, పులిని అడవిలోకి తరిమికొట్టేందుకు కూంబింగ్ టీమ్‌లను నియమించినట్లు బిస్వాల్ తెలిపారు. పులులు, చిరుతపులులతో సహా పెద్దపులుల సంచారం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని బిస్వాల్ చెప్పారు. దీంతో గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement