Sunday, November 17, 2024

Spl Story | గుజరాత్​లో 40వేల మహిళల మిస్సింగ్​​.. పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం

మహిళల మిస్సింగ్​కు సంబంధించిన ఓ సినిమా కథాంశం ‘ద కేరళ స్టోరీ’.. అయితే ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించినట్టు మూవీ మేకర్స్​ తెలిపారు. ఈ సినిమా రూపకల్పన సరిగా లేదని, కావాలని కొన్ని వర్గాలను టార్గెట్​  చేశారని వామపక్షలు ఆరోపిస్తుంటే.. బీజీపీతో సహా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేరళ స్టోరీ ఆ రాష్ట్ర ముఖచిత్రాన్ని ప్రతిబింబోస్తోందన్నారు. మహిళలకు కేరళలో రక్షణ లేదని మండిపడ్డారు.  కాగా, గుజరాత్​లోనే పెద్ద ఎత్తున హ్యూమన్​ ట్రాఫికింగ్​ జరిగిందని.. అయినా అక్కడి సర్కారు కొంచెం కూడా పట్టించుకోవడం లేదని మాజీ ఐపీఎస్​ అధికారులు, మానవహక్కుల కమిషన్​ నేషనల్​ క్రైమ్​ బ్యూరోలో నమోదైన లెక్కలతో సహా బయటపెట్టారు.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

కేరళలో మహిళల అదృశ్యం నేపథ్యంలో వచ్చిన సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఇప్పుడు ప్రధాని  మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా సొంత రాష్ట్రం గుజరాత్​లోనే పెద్ద ఎత్తున మహిళల మిస్సింగ్​ కేసులు నమోదయ్యాయని నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో డేటాని బయటపెట్టారు ఆ రాష్ట్ర అధికారులు. గుజరాత్​ మానవహక్కుల కమిషన్​ సభ్యుడు, మాజీ ఐపీఎస్​ అధికారి సుధీర్​ సిన్హా నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో (ఎన్​సీఆర్​బీ)డేటాని 2016 నుంచి 2020 వరకు లెక్కలతో సహా వెల్లడించారు.. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి కొత్త వివాదాన్ని రేకెత్తిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్​, వామపక్ష పార్టీల మధ్య తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.

గుజరాత్ రాష్ట్రంలో ఐదేళ్ల వ్యవధిలో 40 వేల మంది మహిళలు తప్పిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు చెబుతున్నాయి. 2016లో 7105 మంది మహిళలు తప్పిపోయారు. 2017లో 7712, 2018లో 9246, 2019లో 9268, 2020లో 8290 మహిళలు మిస్సింగ్​ అయినట్టు ఆధారాలున్నాయి. ఈ వివరాలన్నీ అధికారికంగా NCRB డేటా (2022)లో గుజరాత్‌లోనే తప్పిపోయిన మొత్తం వివరాలని.. ఇందులో మొత్తం 41,621మంది మిస్​ అయినట్టు కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది.

- Advertisement -

కాగా, ఇట్లాంటి మిస్సింగ్ కేసులను గుజరాత్​ ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు సుధీర్ సిన్హా అన్నారు. గుజరాత్​లో మిస్సింగ్ కేసులు మర్డర్​ కేసులతో సమానంగా ఉన్నాయని. ఒక బిడ్డ తప్పిపోతే, తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అయితే.. పోలీసు వ్యవస్థ కొంతకాలం చూసి, ఇలాంటి కేసులను మామూలు కేసులుగా పరిగణించి కొట్టివేస్తుందన్నారు.

అంతేకాకుండా.. తప్పిపోయిన (మిస్సింగ్​) బాలికలు, మహిళల కేసుల ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం మానవ అక్రమ రవాణా (హ్యూమన్​ ట్రాఫికింగ్​)కు సంబంధించినవేనని గుజరాత్​ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ రాజన్ ప్రియదర్శి తెలిపారు. తాను ఖేడా జిల్లాలో (గుజరాత్) ఎస్పీగా జాబ్​ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్​కి చెందిన ఒక దినసరి కూలీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన బాలికను అపహరించి తన సొంత రాష్ట్రంలో విక్రయించిన కేసు నమోదైందన్నారు. తాము ఆ బాలికను రక్షించి ఆ వ్యవసాయ కూలీ కుటుంబానికి అందించామన్నారు. అయినప్పటికీ ఇట్లాంటి కేసులో పెద్ద సంఖ్యలో పరిష్కారానికి నోచుకోలేదన్నారు. 

ఇక.. బీజేపీ ప్రభుత్వ నారీ శక్తి నినాదాన్ని తప్పుపట్టారు గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హిరేన్ బ్యాంకర్. బీజేపీ నేతలు కేరళలోని మహిళల గురించి మాట్లాడుతున్నారు (ది కేరళ స్టోరీ). కానీ, ప్రధాని మోదీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కానీ.. తమ రాష్ట్రంలోని మహిళల గురించి పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో జరిగిన అమానవీయ ఘటనలను, అమానుషాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు కానీ, ఇతర రాష్ట్రాల్లో మంటలు చెలరేగించే కార్యక్రమానికి ఒడిగట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement