శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించే విధంగా ప్రత్యేక శిక్షణ పొందిన 33 పోలీస్ జాగిలాలు ( వీటిని పోలీస్ భాషలో కెనెన్ అని పిలుస్తారు), 47 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం జరుగనుంది. మొయినాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో జరిగే పోలీస్ జాగిలాలు, ట్రైనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్త, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనీల్ కుమార్ లు ముఖ్య అతిధిలుగా హాజరవుతారు.
మొయినాబాద్ శిక్షణా కేంద్రంలో ఈ 33 జాగిలాలకు, 47 మంది హాండ్లర్స్ లకు(శిక్షకులు) ఎనిమిది నెలల పాటు ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఈ 50 జాగిలాలలో ప్రధానంగా లెబ్రడాల్, జర్మన్ షెప్పర్డ్, బెల్జియం మాలినోస్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందినవి వున్నాయి. తెలంగాణ, గోవా రాష్ట్రాలకు చెందిన జాగిలాలు, శిక్షకులు ఈ బ్యాచ్ లో ఉన్నారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్.పి. కె. నర్సింహా ఈ బ్యాచ్ తుది పరీక్షకు ఎక్జామినర్ గా హాజరయ్యారు.
కుక్కలకు వాసన చూసె శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అధికం. విశ్వాసానికి మారు పేరుగా నిలిచే కుక్కలు.. పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 435 రకాల జాతులు ఉన్నాయి. చూసేందుకు అన్ని ఒకే పోలికతో ఉన్నప్పటికీ ఒక్కో జాతి శునకం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వీటిలో ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీస్ శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటున్నది.
తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ లెబ్రడాల్, డాబర్మెన్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షపర్డ్ వంటి ఆరు రకాల జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోస్తున్నది. ఇవి కాకుండా ఎయిర్ ఫోర్టులో తనిఖీల కోసం చిన్నవిగా వుండే కాకర్స్ స్పెనియన్ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. హైదరాబాద్లోని మొయినాబాద్లో పోలీస్ శాఖ అధ్వర్యంలో ఉన్నఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీలో పోలీస్ జాగిలాలకు కఠోర శిక్షణ ఇచ్చారు. తమకు అవసరమైన జాగిలాల గురించి ఆయా యూనిట్ల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీవింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఆయా యూనిట్లకు కావాల్సిన కుక్క (స్నిఫర్ లేదా ట్రాకర్)ను తీర్చిదిద్దేందుకు మూడు నెలల వయస్సు కలిగిన కుక్క పిల్లలను అందుబాటులోని కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. దీనిని హ్యాండ్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ను కేటాయిస్తారు.
మొదటి నెలలో గ్రూమింగ్, వేళకు ఆహారం ఇవ్వడం ద్వారా యజమాని (హ్యాండ్లర్) పట్ల కుక్కకు ప్రేమ, ఆకర్షణ కలిగేలా చేస్తారు. ఈ సమయంలో కుక్క తన యజమానిని గుర్తించే స్థాయికి చేరుతుంది. నాలుగో నెల నుంచి ఐదో నెల వరకూ విధేయత, కూర్చోవడం, నిలబడడం, పడుకోవడం, సెల్యూట్ చేయడం వంటివి నేర్పిస్తారు. ఆ తర్వాత వాటికి ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత పొందిన వాటికి ఐదు నెలల పాటు పేలుడు పదార్థాలు, మాదక ద్యవ్యాలను కనిపెట్టడం, నిందితుల ఆచూకీలను కనిపెట్టడం తదితర అంశాల్లో పూర్తి స్ధాయి శిక్షణనిస్తారు.
ఉదయం ఆరుగంటలకు కెనెన్ లను స్థావరం నుంచి బయటకు వదులుతారు. ఎనిమిది గంటల వరకు రన్నింగ్, వ్యాయామంతో పాటు దైనందిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. అరగంట పాటు గ్రూమింగ్ (దువ్వడం) చేస్తారు. ఎనిమిదిన్నరకు ఆహారం ఇచ్చి తిరిగి క్యానల్లోకి పంపిస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నర గంటల వరకూ తిరిగి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. సాధారణంగా శునకాల జీవిత కాలం 12 నుంచి 14 సంవత్సరాలు. పోలీస్ జాగిలాలకు ఎనిమిదేళ్లు నిండగానే ఉద్యోగ విరమణ చేయిస్తారు. ఎందుకంటే ఈ వయసుకు వచ్చే సరికి జాగిలాలలో వాసన పసిగట్టే శక్తి తగ్గిపోతుంది. పేలుడు పదార్థాలను గుర్తించే జాగిలాలు సాధారణం కంటే 40 రెట్లు ఎక్కువగా వాసన పీల్చుతాయి.