కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అన్ని రంగాలను కుదిపేసింది కరోనా. అయితే వీటన్నింటికి భిన్నంగా కార్లని కొనుగోలు చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందట. 2021మార్చి నుంచి మే వరకు కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. కానీ సంవత్సరం మొత్తం చూసుకుంటే కార్లు కొనేవారి సంఖ్య బాగానే ఉందని పలు గణాంకాలు వెల్లడించాయి. 2021లో కార్ల విక్రయాలు 27 శాతం పెరిగాయట. చరిత్రలో ఒక ఏడాదిలో 30 లక్షల కార్లు అమ్ముడుపోవడం ఇది మూడోసారి. 2017లో 32.3 లక్షల యూనిట్లు, 2018లో 33.95 లక్షల యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయి. సెమీకండక్టర్ల (చిప్‌లు) కొరత, ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం వంటి సమస్యలను కంపెనీలు ఎదుర్కొన్నాయి.
ధరలను కూడా పలు మార్లు పెంచాయి. అయినా కానీ విక్రయాలను పెంచుకోగలిగాయంటే.. వినియోగదారుల నుంచి ఉన్న బలమైన డిమాండే కారణమని చెప్పాలి. కార్ల కంపెనీలు 2021లో తమ డీలర్లకు 30.82 లక్షల కార్లను పంపించాయి. ఈ గణాంకాలను విక్రయాలుగా పరిగణిస్తుంటారు. 2020లో ఇలా పంపించింది 24.33 లక్షల యూనిట్లు మాత్రమే. మారుతి సుజుకీ 13.65 లక్షలు, హ్యుందాయ్ 5 లక్షల యూనిట్ల చొప్పున విక్రయాలను నమోదు చేశాయి. మొత్తానికి కార్ల బిజినెస్ కి కరోనా అడ్డుకట్టవేయలేకపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..