Thursday, November 21, 2024

సొంతింటి క‌ల నెర‌వేరేలా, 3 విడతల్లో 3 లక్షలు.. జూన్‌ నుంచి ప‌థ‌కం అమలు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సొంత జాగా ఉండి ఇళ్లుకట్టుకునే ఆర్థికస్థోమత లేనివారికి ప్రభుత్వం త్వరలోనే ఆదుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు ఒకే సారి ఇవ్వకుండా మూడు విడతల్లో ఇవ్వాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విధివిధానాలను రూపొందించే పనిలో వారు తలమునకలయ్యారు. త్వరతగతిన మార్గదర్శకాలు రూపొందించి జూన్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మొదటి విడత లబ్ధిదారలను ఎంపిక చేసి ఆర్థిక సాయాన్ని కూడా ఇదే ఏడాదిలో వారి వారి ఖాతాల్లో జమ చేయాలని సర్కారు భావిస్తోంది. ఈనేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపిక, ఎన్ని గజాల స్థలం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింప చేయాలి? రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒకే సారి ఇవ్వాలా? లేక 3 విడతల్లో ఇవ్వాలా? అనే నిబంధనలపై అధికారులు మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

వంద గజాల నుంచి 300 గజాల వరకు?
రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధిచిన గైడ్‌లైన్స్‌ రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కనిష్టంగా 100 గజాలు, గరిష్టంగా 300పైగా గజాల వరకు సొంత జాగ కల్గిఉన్న వారిని అర్హులుగా నిబంధనలు రూపొందించాలని అధికారులు అనుకుంటున్నట్లు సమాచారం. అయితే కేంద్ర పథకం విధివిధానాల్లో ఇంటి నిర్మాణం పరిధి 330 చదరపు అడుగులకు తగ్గకూడదన్న నిబంధన ఉంది. ఇదే నిబంధన అమలు చేస్తే చాలా మందికి నష్టం చేకూరే అవకాశం ఉంది. 330 చదరపు అడుగుల స్థలం కల్గి సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థికసాయం కోసం ఎదురు చూసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎక్కువగా 100 నుంచి 300లోపు చదరపు అడుగుల స్థలం కల్గిన వారే ఉంటారని ఓ అంచనా. వీరికే ఈ పథకం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం అందజేసే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒకే సారి కాకుండా, విడతల వారీగా సాయం చేసేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణం ప్రారంభం చేసి పునాదులు వేసి పిల్లర్ల వరకు ఇంటిని నిర్మిస్తే మొదటి విడతలో భాగంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తారు. రెండో విడతలో గోడలు కట్టి, సబ్జెలు వేసి స్లాబు(పైకప్పు) వరకు నిర్మిస్తే మరో రూ.లక్ష, మూడో విడతలో స్లాబు వేసి గోడలకు సన్నమాలు చేసి, రంగులు వేస్తే మరో రూ.లక్ష ఆర్థిక సాయం చేసేలా అధికారులు మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ఈ విధంగానే విడతల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది. దాదాపు ఇలాంటి నిబంధనలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా ఖాతాల్లోకి జమ చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. మొత్తం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒకే సారి చేయాలా? లేక ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంట్‌, స్టీల్‌ను అందిస్తే ఎలా ఉంటుందనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

డబుల్‌ బెడ్‌రూంకు పెరుగుతున్న బడ్జెట్‌!…
ఇళ్లు లేని వారికి ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ ఇళ్లకు రూ.12000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించగా, అందులో లబ్ధిదారులకు అందించే రూ.3 లక్షల ఆర్థికసాయానికి రూ.7,350 కోట్లను ప్రతిపాదించింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల భారం ప్రభుత్వంపై తీవ్రంగా పడుతోంది. డబుల్‌ ఇండ్లలో కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం సాయం అందేలా, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల భారం తగ్గేలా రూ.3 లక్షల పథకాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే సొంత జాగ ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయడం ద్వారా ప్రభుత్వంపై కొంత భారం తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అందుకు నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లను ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది. వీటిలో 3 లక్షల 57 వేల ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43 వేల ఇళ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీఎం పరిధిలో ఉంటాయి. ఈ పథకం అందుబాటులో రావడం ద్వారా చాలా మంది సామాన్యులకు లబ్ధి చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement