Friday, October 18, 2024

ఉదయం ఉరుకులు పరుగులు.. రెండో రోజు లాక్ డౌన్!

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్ర‌తి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. ఉదయం 6 గంటల నుండే ఉరుకులు పరుగులు పెట్టారు. ఉదయం 6 గంటల నుంచే నగరంలోని పలు ప్రధాన కూడళ్ల‌లో వాహ‌నాల రద్దీ నెల‌కొన్న‌ది. న‌గ‌రంలోని ప‌లు మార్కెట్లు, దుకాణాల వ‌ద్ద జ‌నం బారులు తీరారు. మినహాయింపుల సమయాన్ని సద్వినియోగం పరుచుకునే యత్నం చేశారు. దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు.. హైదరాబాద్‌లో బస్సులు లేక ఇబ్బందిపడ్డారు.

ఉదయం 6 నుండి 10గంటల వరకు అన్ని కార్యకలాపాలను నిర్వహించుకు నేందుకు ప్రభుత్వ అనుమతి ఉండగా, వాణిజ్య దుకాణ సదుపాయాలు, కూర గాయల దుకాణాలు అన్నీ తెరుచుకున్నాయి. కొనుగోలుదారులు కూడా ఉరుకులు పరుగులు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల గడువు లోనే.. తమ పనులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఉదయం  10 గంటల తర్వాత దాదాపు తెలంగాణలోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల‌ ప‌నివేళ‌ల్లో మార్పులు చేశారు. నేటి నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ప‌నిచేయానున్నాయి. అదేవిధంగా పోస్టాఫీసుల్లో వినియోగ‌దారుల సేవ‌ల స‌మ‌యాల‌ను త‌పాలా శాఖ కుదించింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంట‌ర్లు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, చిన్న పోస్టాఫీసుల్లో ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేయ‌నున్నాయి.

ఇది కూడా చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్

Advertisement

తాజా వార్తలు

Advertisement