ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో నివాసంపై సీబీఐ దాడులు జరిగాయి. అనంతరం సిసోడియా మాట్లాడుతూ… 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. కేజ్రీవాల్ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే తనపై ఎక్సైజ్ పాలసీ స్కామ్‌ను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్‌లో మంత్రిని కావడమే తాను చేసిన నేరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం ఎక్సైజ్ స్కామ్ అంశం కాదని, కేజ్రీవాల్‌తోనే వారికి సమస్య అన్నారు. ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కుట్రపూరితంగా వ్యవహరించకుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏటా రూ 10,000 కోట్లు ఆర్జించేదని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ దూకుడుకు కళ్లెం వేసేందుకే తన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో తాము చేపట్టిన ఎక్సైజ్ పాలసీ దేశంలోన మెరుగైన విధానమని మనీష్ సిసోడియా చెప్పుకొచ్చారు.