– ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర
ప్రధానంగా ఈ ఏడాది హీరో కృష్ణ కుటుంబంలో వరుస మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణ, సతీమణి ఇందిరాదేవి, విజయనిర్మల, కుమారుడు రమేష్ బాబు కొద్ది నెలల వ్యవధిలోనే కన్నుమూయడం ఆ కుటుంబంలో పెను విషాదం. హీరో కృష్ణ అభిమానులు ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయటపడలేక పోతున్నారు. ఇక.. తెలుగు సినీ పరిశ్రమలో హీరో కృష్ణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు ముందు హీరో వుండటం కృష్ణకే చెల్లింది. ప్రయోగాత్మక చిత్రాలకు ఆద్యునిగా, సాహసానికి మరోపేరుగా, హీరో కృష్ణ ప్రేక్షక హృదయాలలో స్థానం పొందారు. తెలుగు తెరకు సినిమా స్కోప్, 70 ఎం ఎం, కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను పరిచయం చేయటం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
సినీ అభిమానులు హీరో కృష్ణ ను వరుసగా అయిదేళ్ల పాటు సూపర్ స్టార్ గా ఎన్నికచేసుకున్నారు. హీరోగా కృష్ణ, హీరోయిన్ గా విజయనిర్మల జంటగా నటించిన చిత్రాలు విజయవంతం అయి, వారిది హిట్ పెయిర్ గా గుర్తింపు పొందింది. అదేవిధంగా కృష్ణంరాజు హీరోగా తొలినాళ్లలో విలన్ గా పలు పాత్రలు పోషించారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలను నిర్మించి, నటించి ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణంరాజు కళ్ళలోనే నవరసాలు పలికించగల దిట్ట. హీరో కృష్ణతో కలసి పలు మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు.
తెలుగు చిత్రసీమ గర్వించదగిన నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. క్యారెక్టర్ నటునిగా, హీరోగా, విలన్ గా, చిత్ర నిర్మాతగా కైకాల సినీరంగానికి బహుముఖ పాత్రలు పోషించారు. ఏ చిత్రంలో అయినా హీరోతో సమానంగా కైకాల ప్రేక్షకుల మన్ననలు పొందేవారు. మరో క్యారెక్టర్ నటుడు చలపతిరావు సైతం ఎన్నో పాత్రలు పోషించారు. క్యారెక్టర్ యాక్టర్ గా గుర్తింపు పొందారు. చలపతిరావు కుమారుడు రవిబాబు పలు ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ, స్వీయ నిర్మాణంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
కృష్ణ సతీమణి గానే కాకుండా విజయనిర్మల తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నవలా చిత్రాల కథానాయకి గా, దర్శకురాలిగా పేరొందారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించడం ద్వారా మహిళా దర్శకుల కేటగిరీ లో ఆమె గ్వినెస్ బుక్ లో స్థానం పొందారు. హీరో కృష్ణ కుమారునిగా సినీ అరంగేట్రం చేసిన రమేష్ బాబు హీరోగా పలు చిత్రాలలో నటించారు. అయితే ఎక్కువకాలం హీరోగా నిలదొక్కుకోలేక పోవటం తో గతకొంత కాలంగా సినీ రంగానికి దూరంగా వుంటున్నారు. ఎన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, హీరో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు. ఈ అయిదుగురు దీర్ఘకాలంపాటు తెలుగు సినీ పరిశ్రమను ‘ కాపు ‘ కాశారు. ఆ అయిదుగురు లేని లోటు తెలుగు సినీ పరిశ్రమలో పూడ్చలేనిది.