రాజస్థాన్‌లోని సవాయ్ మధోపూర్ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2011లో జరిగిన మతపరమైన అల్లర్ల కేసులో అడిషనల్ సెషన్స్ కోర్టు 30 మందికి జీవిత ఖైదు విధించింది. వీళ్లలో మహేందర్ సింగ్ తన్వర్ అనే డీఎస్పీ కూడా ఉన్నారు. ఫూల్ మొహమ్మద్ ఖాన్ అనే ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)ను సజీవంగా దహనం చేసిన కేసులో వీళ్లకు సవాయ్ మధోపూర్‌లోని అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. వీళ్లలో కొందరిని రూ. 2, 000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
మొహమ్మద్ ఖాన్ మాన్‌టౌన్ పోలీస్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా పనిచేసేవాడు. 2011 జూన్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగినప్పుడు అతను తీవ్రంగా గాయపడ్డాడు. అల్లరిమూకల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు తన వాహనంలో దాక్కున్నాడు. కానీ, కొందరు ఆ వాహనాన్ని చుట్టుముట్టి నిప్పు పెట్టారు. దాంతో, అతను సజీవంగా అగ్నికి ఆహుతయ్యాడు. మొదట్లో ఈ కేసుని సీఐడీ విచారణ చేపట్టింది. అయితే, రాజస్థాన్ ప్రభుత్వం కోరిక మేరకు సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ కేసులో 79మందిని విచారించిన అడిషనల్ సెషన్స్ కోర్టు 30 మందిని దోషులుగా తేల్చింది. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.