Saturday, November 23, 2024

Big Story: 20శాతం పెంపుతో సంక్షేమ పద్దు.. 2.65లక్షల కోట్లను మించనున్న బడ్జెట్‌

మరో సంక్షేమ భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 11.30గంటలకు ఉభయ సభల్లో ప్రతిపాదించనుంది. తీవ్ర వివాదం రేకెత్తించిన గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నేరుగా ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా, భారీ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ బడ్జెట్‌ చాలా కీలకంగా మారనుంది. 2022-23 వార్షిక బడ్జెట్‌ ఈ ఏడాది మొత్తానికి అమలు కానుంది. 2023 డిసెంబర్‌లో శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టినా అది పూర్తి ఏడాదికి అమలు కాబోదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉద్యోగ నియామకాలు, దళితబంధు పథకాలపై నిధుల కేటాయింపులతోపాటు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు దండిగా నిధులను పెంచనున్నారని సమాచారం. తాజాగా రాష్ట్ర ఆర్ధిక వృద్ధిరేటు 19శాతంపైగా నమోదు కావడం, కీలక శాఖల్లో అంచనాలకు మించిన ఆదాయర్జన నేపథ్యంలో వచ్చే ఆర్ధిక యేడాదిలో సొంత వనరుల రాబడి కీలకంగా మారుతోంది.తెలంగాణలో ఆర్ధికాభివృద్ధికితోడు పారిశ్రామిక ప్రగతి ప్రతిబింబించేలా 2022-23 ఆర్ధిక యేడాదికి రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ ప్రతిపాదించనుంది. సొంత వనరుల రాబడితోపాటు వివిధ రంగాల్లో అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో 2022-23 వార్సిక బడ్జెట్‌ ప్రభుత్వ వ్యూహాలకు, ముందస్తు అంచనాలకు అనుగుణంగా కీలకంగా మారనుంది.
ఖజానాకు భారంగా మారే పథకాలకు బదులుగా ప్రజలకు, రైతాంగానికి నేరుగా ఉపకరించి, ఉత్పాదనా సామర్ధ్యం పెంచే ఆర్ధిక సాయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న పథకాలు, అన్ని వర్గాలు, శ్రేణులకు ఇతోధిక సాయంగా నిలుస్తున్న సర్కార్‌ తాజాగా పథకాల అమలు తీరుపై సమీక్షించుకుంటోంది. నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రైతాంగానికి పెద్ద పీట వేయడంతోపాటు, నిరుద్యోగ యువత సంక్షేమమే లక్ష్యంగా కీలక పథకాల రూపకల్పనకు శ్రీకారం చుడుతోంది. ఈ ఐదేళ్లలో ఇదే చివరి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ కావడంతో కొత్త పథకాలు, ప్రజల ఆకాంక్షలు లక్ష్యంగా అనేక ప్రజారంజక పథకాలు ఉంటాయని అంచనాలున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన ఎన్నికల ఎజెండాలో భారీ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ప్రధానంగా రైతు రుణమాఫి, పించన్లు పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి కీలక హామీలను పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ఫిట్‌మెంట్‌ల ప్రకటన, ఇతర శాఖల్లో వేతనాల పెంపు వంటి చర్యలను సమర్ధవంతంగా పోషించింది. ఇక కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్స్‌ వంటి పథకాలు జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నాయి. రైతులకు ఎకరాకు రూ. 10వేల పెట్టుబడి సాయం నిరాటంకంగా అందుతోంది. ఈ నేపథ్యంలో ఆయా నిర్ధేశిత పథకాల కొనసాగింపుతోపాటు సంక్షేమం, వైద్యం, విద్య రంగాలకు భారీగా నిధుల కేటాయింపు జరగనున్నట్లు సమాచారం. సాగునీటి పారుదల శాఖకు రూ. 25వేల కోట్లు, పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 18 వేల కోట్లు, బీసి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 20వేల కోట్ల నిధులను కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్‌లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులను కేటాయించాల్సిన అవసరం నెలకొంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పెరుగుతున్నాయి.
2022-23 వార్షిక ఏడాదిలో ప్రభుత్వం పలు కీలక పథకాలకు నిధులను బారీగా కేటాయించాలని ప్రణాళికలు వేసుకున్నది. దళితబంధుకు రూ. 20వేల కోట్లు, రైతుబంధుకు రూ. 18వేల కోట్లు, ఆసరా పించన్లకు రూ. 15వేల కోట్లు, విద్యుత్‌ సబ్సిడీలకు రూ. 12వేలకోట్లు, వేతనాలకు రూ. 50వేల కోట్లు కేటాయింపులు ఉండనున్నాయి. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ రూ. 2,30,826కోట్లలో ఈ ఏడాది చివరకు పలు ప్రతికూల అంశాల నేపథ్యంలో రూ. 2,20 లక్షల కోట్లకే చేరనుందని సవరించిన అంచనాలతో తేటతెల్లమవుతోంది. కాగా 2022-23 వార్షిక బడ్జెట్‌ మరో రూ. 40వేల కోట్లు పెరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూముల విక్రయాలకు కోర్టు కేసుల ఊరటతోపాటు రాష్ట్ర ఆదాయ వనరులు ఆశాజనకంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ మేరకు పెరుగుదలను వర్తింపజేయనున్నారని ఆర్ధిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధుతోపాటు, విద్యుత్‌ సబ్సిడీలకు, సంక్షేమ రంగాలకు ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యత దక్కనున్నది. కేంద్రంనుంచి రాష్ట్రానికి అందే గ్రాంటులు, సాయంపై స్పష్టత రావడంతో వార్షిక బడ్జెట్‌ ఆమోదానికి సిద్దమైంది. ప్రభుత్వ ఖర్చులు, చెల్లింపులకు, వ్యయాలకు, రాబడులకు ఇబ్బందులు లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును మార్చి 31లోపు ఆమోదించేలా చర్యలు తీసుకుంది. ప్రతీయేటా మూడు వారాలపాటు బడ్జెట్‌ పద్దులపై అంశాలవారీగా చర్చించడం ఆనవాయితీగా వస్తుండగా గత రెండేళ్లు కరోనా కారణంగా పరిమిత పనిదినాలతో సమావేశాలను నిర్వహించారు. బడ్జెట్‌ సమర్పించిన తర్వాత బీఏసీలో చర్చించి పనిదినాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో బడ్జెట్‌ ఆమోదంతోపాటు, కీలక బిల్లును ఆమోదించానున్నారు. విపక్షాలు కోరితే పద్దులపై సవివరంగా చర్చించేందుకు పనిదినాలను ఈ సమావేశాల్లో పొడిగించే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, గ్రాంట్లు, ప్రత్యేక సాయం వంటి పూర్తి వివరాలు వెల్లడవడంతో ప్రాధాన్యతలకు అనుగుణంగా తుది బడ్జెట్‌ పద్దులను ఆర్ధిక శాఖ రూపొందించింది.

కేటాయింపుల్లో ..
ఈ ఏడాది మార్చి చివరినాటికి ఆదాయం రూ. 20వేల కోట్లవరకు గండి పడొచ్చనే అంచనాలున్నాయి. కాగా పన్నుల వసూళ్లలో రాష్ట్రం గణనీయమైన ప్రగతిని నమోదు చేసుకున్నది. 2021-22లో జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను, ఎక్‌జ్‌ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర పన్నులతో కలుపుకుని రూ. 1,06,900.13కోట్లను అంచనా వేయగా, జనవరి 31నాటికి రూ. 85,378.59కోట్లు (79.87)శాతంగా నమోదయయ్యాయి. ఈ ఏడాది రెవెన్యూ రాబడుల కింద రూ.1,76,126కోట్లను అంచనా వేయగా, జనవరినాటికి రూ. 98,282కోట్లు సమకూరాయి. కేంద్ర గ్రాంట్లలోనే భారీ కోతలు ఎదురయ్యాయి.

ప్రతికూలతల కారణంగా…
ఆర్థికంగా రానున్న రోజుల్లో రాబడి వృద్ధి రేటులో మందగమనం, ఇతర పరిస్థితులను బెెరీజు వేసుకున్న ప్రభుత్వం కొన్ని పథకాలు, శాఖలకు కేటాయింపులను తగ్గించనుంది. సాగు, సంక్షేమం, విద్యుత్‌ రంగాలకు ప్రాధాన్యతనిస్తూనే, రైతుబంధు, రైతుబీమా, వైద్య, విద్య, మున్సిపల్‌, ఇతర పథకాలకు అత్యధిక నిధులతో కేటాయింపులు చేయనున్నారు. మన ఊరు-మన బడికి రూ. 7300కోట్లను, మున్సిపాలిటీలకు ఉద్యోగాల కేటాయింపులకు రూ. 5వేల కోట్లు, ఇతర అనేక రంగాలకు కొత్తగా కేటాయింపులు చేయనున్నారు. ఈ ఏడాది రూ. 38669కోట్లు అంచనా వేయగా, కేంద్రంనుంచి రూ. 7303 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇది కేవలం 18.89శాతం మాత్రమే కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement