కల్తీ కొకైన్ తో 20మంది మృతిచెందగా, మరో 75 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషాద ఘటన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో చోటుచేసుకుంది. విష పదార్ధాలు కలిసిన కొకైన్ తీసుకున్న 20మంది మరణించగా మరో 75మందికి పైగా ప్రాణాలతో పోరాడతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది పట్టణాల్లో విష పదార్థాలు కలిసిన కొకైన్‌ను తీసుకోవడంతో ఇప్పటి వరకు 20 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో 75మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా వీరిని హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం బాగా ఉంది. డ్రగ్స్ అమ్మకాల్లో సదరు ముఠాల మధ్య పోటీ కూడా ఉంటుంది. దీంతో ఈ ముఠాలకు ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ఉద్దేశపూర్వకంగానే మాదకద్రవ్యాలను కల్తీ చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..