మావోయిస్టుల హింసాత్మక ఘటనలతో విసిగిపోయిన చాలామంది నక్సలైట్లు ఆ పంథా వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ అన్నారు. అటవీ జీవనంలో ఉండలేక ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలసీ వైపు ఆకర్షితులవుతున్నారు. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల ఇప్పటికే పెద్ద సంఖ్యలో క్రియాశీల నక్సలైట్లు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారన్నారు. ఇంకా చాలా మంది లొంగుబాటు దారిలో ఉన్నట్టు తెలిపారు.
కాగా, ఇవ్వాల (బుధవారం) తిమ్మా జావేలిలో ఉంటున్న 26 ఏళ్ల అనిల్ అలియాస్ రామ్‌సే జగదేవ్ కుజూర్, దండిమార్కలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల రోషని అలియాస్ ఈరపే నారంగో పల్లో అనే ఇద్దరు మావోయిస్టులు గడ్చిరోలీ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ అంకిత్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. 2009 డిసెంబర్లో కసన్సూర్ LOS (స్థానిక సంస్థాగత స్క్వాడ్) సభ్యుడిగా అనిల్ నియమితుడయ్యాడు.
మే 2010 వరకు నక్సలైట్ అనిల్ అక్కడే పనిచేశాడు. 2012 నుండి 2022 మధ్య కాలంలో అతను మిలీషియాలో పనిచేశాడు. 2011లో ఖోబ్రమేంధా ఆంబుష్‌లో పాల్గొన్నాడు. వీరి అటాక్లో ఒక CRPF జవాన్ చనిపోయాడు. ఐదుగురు గాయపడ్డారు. అంతేకాకుండా మౌజా నిహైకల్, గ్యారపట్టి రోడ్ ఆకస్మిక దాడిలో కూడా అనిల్ పాల్గొన్నాడు అని ఎస్పీ వివరించారు. 2011లో చోటా జెలియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా పాల్గొన్నాడన్నారు.
ఇక.. రోషనీ 2009, 2015 మధ్య జోన్ టెక్నికల్ దళం (డేటా అసిమిలేషన్ లిమిటెడ్ ఏరియా మోడల్)లో పనిచేసింది. ఆమె 2015లో మౌజా కుండలాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది. 2015లో మౌజా ఇరప్నార్‌లోని ముగ్గురు అమాయక నివాసితులను ఆమె హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఎస్పీ తెలిపారు.
కాగా, 2019, 2022 మధ్య కాలంలో మొత్తం 51 మంది నక్సలైట్లు గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. నక్సలిజం వదలి ప్రజాస్వామ్య మార్గాల్లో జీవించడానికి సిద్ధంగా ఉన్నవారికి సరైన, అవసరమైన సహాయం అందిస్తామని ఎస్పీ అంకిత్ గోయల్ హామీ ఇచ్చారు. మావోయిస్టులు వారి హింసా మార్గాన్ని వీడి శాంతి మార్గాన్ని అవలంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.