Thursday, November 21, 2024

Loksabha: పేదలంటే బీజేపీకి గిట్టదు.. అదాని, అంబానీలే వారికి ముద్దు: రాహుల్​ గాంధీ

దేశంలో పేదలంటే బీజేపీకి గిట్టదు. వారు పెట్టిన బడ్జెట్​లోని అంశాలే దీన్ని తేటతెల్లం చేస్తున్నాయి.. కానీ, ఇద్దరు అంటే మోడీకి, బీజేపీకి ఎంతో ముద్దు.. దేశంలోని అన్ని పోర్టులు, విమానాశ్రయాలు, మైనింగ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఏది ఉన్నా.. అక్కడ అదానీ కనిపిస్తాడు.. మరోవైపు అంబానీ జీ.., వీరిద్దరికే డబ్బు మొత్తం దక్కుతోంది.. అని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేశంలో రోజు రోజుకు అంతరం పేరుగుతోందని, ఇప్పుడు రెండు విభిన్న పరిస్థితులను స్పష్టంగా చూస్తున్నామని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. లోక్​సభలో ఇవ్వాల ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదలకు ఎటువంటి మేలు చేయడం లేదని, కానీ, ఒకరిద్దరు సంపన్నులకు మాత్రం అదే పనిగా దోచిపెడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో ఆయన పార్లమెంట్​లో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో వీటిని చేర్చలేదని, ప్రధానంగా రెండు అంశాలను చేర్చాల్సి ఉండేదని రాహుల్​ అన్నారు. ఒకటి అపార సంపద ఉన్న భారతదేశం, రెండోది నిరుపేదల భారతదేశంగా వర్థిల్లుతోందని.. కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయి లక్షలాది మంది తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారని.. అయినా కేంద్రానికి ఇవన్నీ పట్టడం లేదని విమర్శలు గుప్పించారు. 

‘‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూ మీరు మాట్లాడుతున్నారు.. మేడ్ ఇన్ ఇండియా ఇక సాధ్యం కాదు..  మేడ్ ఇన్ ఇండియాను నాశనం చేశారు.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి.. లేకుంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎట్లా సాధ్యం అవుతుంది.  చిన్న మధ్య తరహా పరిశ్రమలు మాత్రమే ఉద్యోగాలను సృష్టించగలవు” అని రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నారు.  మీరు మేడ్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా మొదలైన వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ, వాటికి ఏం చర్యలు తీసుకుంటున్నారో మాత్రం చెప్పరు. మరోవైపు అంతులేని నిరుద్యోగం పెరుగుతోంది.. అని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వంలోని నా స్నేహితులకు..  నేను మాట్లాడే మాటలు అసౌకర్యానికి గురిచేయొచ్చు.. విమర్శలను స్ఫూర్తిగా తీసుకోవాలి.  తాజా పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న దేశ పౌరుడిగా నా వ్యాఖ్యలను తీసుకోండి అన్నారు.  

రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి ఒక్క వాక్యం కూడా లేదు. భారతదేశంలోని యువత ఉపాధి కోసం అడుగుతున్నారు. కానీ మీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. 2021లో 3 కోట్ల మంది యువత ఉపాధి కోల్పోయారు. 50 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం ఇప్పుడు చూస్తున్నాం.  ఎంత మందికి ఉపాధి ఇస్తారు. దాని గురించి మీరు మాట్లాడరు.మీరు దేశంలోని అత్యంత ధనవంతులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తారు.  ఎలా అంటే? నోట్ల రద్దు, తప్పు GSTతో కొంతమందిధనవంతులకు మాత్రమే మీరు అండగా ఉంటున్నారు అన్నదిస్పష్టంగా తెలుస్తోంది అని రాహుల్​ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా  కొవిడ్ సమయంలో పేదలకు ఎటువంటి సహాయం అందించలేదు. ఉపాధి లేక, పనులు లేక జనాభాలో 84% మందికి ఆదాయం తగ్గింది. UPA ప్రభుత్వంలో 23 కోట్ల మందికి ఉపాధి కల్పించడం ద్వారా పేదరికం నుండి బయటపడ్డారని రాహుల్ గాంధీ అన్నారు.

ఇవి మేము చెబుతున్న లెక్కలు కాదు.. ఇవి అధికారిక లెక్కలు.. మీరు 23 కోట్ల మంది ప్రజలను తిరిగి పేదరికంలోకి నెట్టారు. అధికారిక రంగంలో గుత్తాధిపత్యం ఏర్పడుతోంది. అదంతా ఒకరిద్దరు వ్యక్తులకు ఇవ్వబడింది, నేను పేరు చెప్పను.. అంటూనే రాహుల్​ గాంధీ అదానీ, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం, మోడీ ఎలా లబ్ధి చేకూరుస్తున్నారనే అంశాలను వివరిస్తూ విమర్శలతో దాడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement