ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వెనక్కి తీసుకురావడానికి ఇండియా అన్ని రకాలా ప్రయత్నాలు చేపట్టింది. వారిని వెనక్కి తీసుకురావడానికి రెండు విమానాలను పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. రష్యా సైనిక కార్యకలాపాల మధ్య దాదాపు 16,000 మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి రెండు ప్రత్యేక విమానాలు పంపించనున్నట్టు అధికారులు వెల్లడించారు. వారిని ఎలా తీసుకురావాలనే దానిపై కేబినెట్ కమిటీ రేపు మధ్యాహ్నం సమావేశమవుతుంది. ఈ విమానాలు ఈ రోజు రాత్రి రొమేనియాకు బయలుదేరి, రేపు భారతీయులతో తిరిగి రావాల్సి ఉంది.
రష్యా ఉక్రెయిన్ ఆక్రమించిన తర్వాత ఎయిర్ బేస్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసింది. ఈ క్రమంలో భారతదేశ పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి అనేకరకాలుగా ప్లాన్ వేస్తోంది ఇండియా. నిన్న సాయంత్రం విదేశాంగ కార్యాలయం హంగేరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమేనియాలోని ఉక్రెయిన్ భూ సరిహద్దులకు తరలింపులో సహాయం చేయడానికి బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. యుద్ధంలో కైవ్‌లోని రాయబార కార్యాలయంతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ దేశంలో పౌరులకు భద్రత కల్పించడం.. వారికి సలహాలు అందజేయడం.. రౌండ్-ది-క్లాక్ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడం.. ఆ ప్రాంతం నుండి సురక్షితమైన మార్గాలను గుర్తించడం వంటి చర్యలపై ఇండియన్ అధికారులు అక్కడున్న వారితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు..
రోజంతా పనిచేసేలా విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా అధికారులు విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఈ కంట్రోల్ రూమ్‌ను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. కైవ్‌లోని రాయబార కార్యాలయం కూడా 24*7 హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతంలోని పాఠశాలల్లో దాదాపు 250 మంది భారతీయులకు వసతి కల్పించామని, పరిస్థితిని బట్టి వారిని పశ్చిమ దిశగా తరలిస్తామని మంత్రి తెలిపారు. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రత గురించి తన ఆందోళనలను హైలైట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. టెలిఫోనిక్ సంభాషణ సందర్భంగా ఉక్రెయిన్‌లో హింసను తక్షణమే నిలిపివేయాలని మోడీ పిలుపునిచ్చారు.